జట్టులో ఏ స్థానంలో అయినా ఆడేందుకు సిద్దం

మందకొడి పిచ్‌పై పాతుకుని పోవడమే లక్ష్యం: ధోనీ

మెల్‌బోర్న్‌,జనవరి18(జ‌నంసాక్షి): జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ స్పష్టం చేశాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్న తర్వాత విూడియాతో మాట్లాడాడు. 231 పరుగుల లక్ష్య ఛేదనలో మహీ 114 బంతుల్లో 87 పరుగులు చేశాడు. వరుసగా మూడో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 2014 తర్వాత అతడు ఒక సిరీస్‌లో వరుసగా మూడు అంతకన్నా ఎక్కువ అర్ధశతకాలు సాధించడం ఇదే తొలిసారి.’జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం. నేను నాలుగో స్థానంలో ఆడినా, ఆరో స్థానంలో ఆడినా జట్టుకు సమతూకం తీసుకురావడం కీలకం. 14 ఏళ్ల అనుభవం తర్వాత ఆరో స్థానంలో ఆడనని చెప్పలేను. పిచ్‌ చాలా మందకొడిగా ఉంది. షాట్లు ఆడటం కష్టమైంది. అందుకే క్రీజులో పాతుకుపోవాలని అనుకున్నాం. కేదార్‌ జాదవ్‌ అద్భుతంగా ఆడాడు. వినూత్నమైన షాట్లు ప్రయత్నించాడు. ఆసీస్‌ బౌలర్లు కఠినంగా బంతులు విసిరారు. కేదార్‌ బ్యాటు, బంతితో జట్టుకు సాయపడతాడు. కుల్‌దీప్‌ గతంలో ఆస్టేల్రియాతో ఆడాడు. దీంతో ఊహించని విధంగా చాహల్‌ను తీసుకొని ఆశ్చర్యపరిచాం. అనుకున్నట్టే అతడు రాణించాడు. ఆసీస్‌ పర్యటన చిరస్మరణీయంగా సాగింది. టీ20 సిరీస్‌ డ్రా చేశాం. టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం’ అని ధోనీ పేర్కొన్నాడు.