జనరల్‌ కృష్ణారావు ఇకలేరు

3

హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి): భారత ఆర్మీ మాజీ చీఫ్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌  జనరల్‌ కేవీ కృష్ణారావు(93) శనివారం కన్నుమూశారు. జనరల్‌ కేవీ కృష్ణారావు  1923 జులై 16న విజయవాడలో జన్మించారు. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కృష్ణారావు వ్యవహరించారు. బ్రిటీష్‌ ఇండియా ఆర్మీ, ఇండియన్‌ ఆర్మీలో కృష్ణారావు సేవలందించారు. 1942-1983 వరకు ఇండియన్‌ ఆర్మీలో సేవలందించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌ పొందారు. గతంలో జమ్మూకశ్మీర్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా ఆయన పనిచేశారు.  1942లో భారత సైన్యంలో చేరిన ఆయన యువ ఆఫీసర్‌గా  బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో  సేవలందించారు. భారత ఆర్మీకి 14 వ ఛీఫ్‌గా కృష్ణారావు పనిచేశారు. భద్రతా అంశాలపై ‘ప్రిపేర్‌ ఆర్‌ పెరిష్‌’, ఆర్మీలో తన సేవలను గుర్తు చేసుకుంటూ ‘ఇన్‌ ద సర్వీస్‌ ఆఫ్‌ ద నేషన్‌’ అనే పుస్తకాలను ఆయన రాశారు. కృష్ణారావు అందించిన సేవలకు గాను పరమ్‌ విశిష్ఠ్‌ సేవా మెడల్‌తో  సత్కరించబడ్డారు.