జనవరి1న హైకోర్టు ప్రారంభం

ఎపి ప్రతిపాదనలపై సుప్రీం సంతృప్తి

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎపిలో జనవరి 1 నుంచి మైకోర్టును ప్రారంభిస్తామని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 1 నుంచి హైకోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంరప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌తో సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్‌ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. డిసెంబర్‌ 15 నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పిందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు జడ్జిలు కూడా సంతృప్తి చెందారని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అతి త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో హైకోర్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. జస్టిస్‌ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున.. అప్పటి వరకు జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.