జనసేనకు సైలెంట్‌ ఓటింగ్‌ పడింది

– అది ఎంత అనేది 23న తెలుస్తుంది
– జనసేన పొలిటికల్‌ క్యాలెండర్‌ సిద్ధం చేస్తున్నాం
– త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్‌ పర్యటన ఉంటుంది
– ఫలితం ఎలా ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాడుతూనే ఉంటాం
– ఎవరెవరో ఏదేదో మొరుగుతుంటారని అన్నిటికీ స్పందించం
– జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మాదాసు గంగాధరం
విజయవాడ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : జనసేన పార్టీకి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైలెంట్‌ ఓటింగ్‌ పడిందని, అది ఎంత అనేది 23న వెల్లడికానున్న ఫలితాల్లో స్పష్టమవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. జనసేన పొలిటికల్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలతో పాటు జిల్లాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలు ఇందులో ఉంటాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక సూచనలు చేసినట్టు చెప్పారు. తమపార్టీ తరపున పోటీ చేసిన యువ అభ్యర్థులతో పవన్‌ కల్యాణ్‌ ఆదివారం భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సాగు, తాగునీటి సమస్యలతో పాటు విద్యా, వైద్యం లాంటి అంశాల విూద జనసేన పార్టీ దృష్టి సారిస్తుందని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, రాజకీయ నాయకులు పర్యటించనున్నట్టు చెప్పారు. తనతో పాటు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ సలహాదారు రామ్మోహన్‌ రావు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు కూడా ఈ పర్యటనలో పాల్గంటారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రతో పాటు భీమవరం, గాజువాక, నరసాపురం నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు ఉంటాయని అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలోనూ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలు ఉంటాయని అన్నారు. తమ ప్రత్యర్థులు చేసే విమర్శలను పట్టించుకోమని, ప్రజా తీర్పును శిరసావహించి మార్పు లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని మాదాసు గంగాధరం పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు సైలెంట్‌ ఓటింగ్‌ పడిందన్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించిందని, తమకు సైలెంట్‌ ఓటింగ్‌ వచ్చిందని.. అది ఎంత అనేది మే 23న తెలుస్తుందన్నారు. ఎవరెవరో ఏదేదో మొరుగుతుంటారని, అన్నిటికీ తాము స్పందించమన్నారు. ఎన్నికల తర్వాత జనసేన ఉండదన్నారని.. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిజాయితీగా రాజకీయాలు చేయడమే నేర్పారని.. రాష్ట్ర రాజకీయాలలో మార్పు తేవాలనే తపనతో పనిచేస్తున్నారన్నారు. మార్పు కోసం ఆయన చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల్లోనూ ప్రజలకు సేవ చేయాలనుకున్న సామాన్యులకు పవన్‌ సీట్లు ఇచ్చారన్నారు. ఫలితాలు వచ్చే వరకు తాము వేచి చూస్తామని.. మిగిలిన పార్టీల్లా జనసేనకు ఎలాంటి ఆందోళనలు లేవన్నారు. ప్రజల తీర్పు వెలువడ్డాకే తమ పార్టీ స్పందన ఉంటుందని అన్నారు.