జమిలి ఎన్నికలతో ఖర్చులను తగ్గించుకోవచ్చు
మనమంతా గొప్పగా భావిస్తున్న, గొప్పగా చెబుతున్న భారత ప్రజాస్వామ్యంలో డొల్లతనం కారణంగా ఎన్నికల నిర్వహణకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతక్ష్యంగా కొంత..పరోక్షంగా మరికొంత ఖర్చు చేసుకుంటున్నాం. ఎన్నికలు…ఖర్చు..రాజకీయాలే ఈ ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారాయి. నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంది. దీంతో రాజకీయాల్లో నీతినిజాయితీ కొరవడింది. కేవలం కొందరు మాత్రమే..అదీ డబ్బుండి పెత్తనం చెలాయించే వారే ఈ ఎన్నికల్లో అంతిమంగా లబ్దిపొందుతున్నారు. ఈ దశలో జమిలి ఎన్నికలపై ప్రధాని మోడీ పదేపదే గుర్తు చేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ఎందుకనో విముఖత చూపుతున్నాయి. ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఏది ఎట్లా ఉన్నా ఒకేసారి ఎన్నికలతో ఖర్చు మాత్రం తగ్గుతుంది. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బుల వృధా ఆగిపోతుంది. అందులో కొంతయినా మిగులుతుంది. జమిలి కేవలం అసెంబ్లీ, పార్లమెంట్‌తోనే సరిపెట్టకుండా, సర్పంచ్ ఎన్నిక దగ్గరి నుంచి అన్ని ఎన్నికలను ఒకేదఫా నిర్వహించాలి. అప్పుడే ప్రయోజనం చేకూరగలదు. ఎన్నికల హింస, ఖర్చు తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. ప్రజాధనం వృధా కాకుండా చూడాలి. రాజీనామాలు చేయడం సవాళ్లు విసరి ఉప ఎన్నికలు వచ్చేలా చేయడం వంటి వాటిపైనా ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఇలాంటి సందర్భాల్లో ఖర్చు ప్రభుత్వం భరించే స్థితి పోవాలి. అయితే జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికీ, దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి ముప్పు కలుగుతుందని లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. నీతి అయోగ్ సమావేశంలో మోడీ చేసిన జమిలి ఎన్నికల ప్రతిపాదనను సిపిఎం వ్యతిరేకిస్తున్నదని పార్టీ నేతలు తెలిపారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం దేశంలో హిందుత్వ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా జమిలి ఎన్నికల పద్ధతిని తీసుకురావాలని చూస్తున్నాయని అంటున్నారు. దేశ వైవిధ్యాన్ని గమనించకుండా ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని కాలరాసేందుకు హిందూత్వ పరివారం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు ఉన్నాయని, ఆ వైవిధ్యాన్ని గుర్తించకుండా ఏకపక్షంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూడటం సరి కాదన్నారు. జమిలి ఎన్నికల పేరుతో ప్రజల నిర్ణయాలను కాలరాసే విధంగా కేంద్రం ముందుకెళుతోందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. నిజానికి జమిలి మాట ఎలా ఉన్నా ఈ సంవత్సారం తంలో మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఇనకలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్,రాజస్థాన్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే వచ్చేయేడు మేలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి జరపడానికి మోడీ పన్నాగం పన్నుతున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదే సందర్భంలో 2018 చివరి మాసాల్లోగానీ, 2019 తొలి మాసాలలో గానీ ఇండియాలో లోక్‌సభకు మధ్యంతర లేదా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రసిద్ధ ‘నొమూరా’ సంస్థ జోస్యం చెప్పింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ సంస్కరణలు దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేవని నొమూరా విశ్లేషించింది. భారతదేశం లో ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కారణంగా ఫలితాలు మోడీకి వ్యతిరేకంగా వచ్చాయి. వీటినుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా 2018 ఆఖరి మాసాల్లోగానీ, 2019 తొలి మాసాలలోగానీ ముందస్తుగా జనరల్ ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. టోక్యో కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ ప్రపంచ ద్రవ్య వ్యవహారాల నిర్వహణ సంస్థ నొమూరా అంచనా వేస్తోంది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి 2019 మేలో ముగుస్తుంది. ఇకపోతే చాలాపార్టీలు మళ్లీ బ్యాలెట్ బాక్సులే బెటర్ అన్నధోరణిలో ఉన్నాయి. ఇవిఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని అంటున్నారు. ఈ కోవలో చంద్రబాబు సహా అన్ని పార్టీల నేతలు ముందున్నారు. ఈవీఎంలు నిర్వహణ, అవి పనిచేసే తీరు గురించి 2014 ఎన్నికల నుంచి పెద్ద రగడ ప్రారంభమైంది. ఈవీఎంల వల్ల అనేక సందర్భాల్లో ఓటింగ్ సరళిలో, లెక్కింపులో పలు రకాల అవకతవకలకు ఆస్కారముందనే అనుమానాలు రావడంతో దేశవ్యాప్తంగానే ఆందోళన మొదలైంది. దీంతో బ్యాలెట్ పేపర్ల వినియోగమే బెటర్ అని రాజకీయా పార్టీలు మళ్లీ డిమాండ్ చేస్తున్నాయి. బ్యాలెట్ పేపర్లు వస్తే తమ సత్తాచాటుతామని అంటున్నాయి. పార్టీలకు, వాటి అభ్యర్థులకూ అనుకూలంగా మెషీన్ల తయారీ, పనితీరులో మార్పులూ చేర్పులూ చేయవచ్చునన్న ఆరోపణలను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ సంస్కరణలు చెల్లుబాటు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.నోట్లరద్దు, జిఎస్టీ వంటి చర్యలు బిజెపి పట్ల ప్రధానంగా మోడీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకుని వచ్చాయి. ఈ దశలో జమిలి ఎన్‌ఇనకలు వెళితే బాగుంటుందన్నా ఆలోచనలో మోడీ ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. ఉప ఎన్నికల ఫలితాలు, ఇటు క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు పార్లమెంటు ఎన్నికలను ముందుకు నెట్టవచ్చన్న జోస్యంతో ముందస్తు ఎన్నికల చర్చ ముందుకొచ్చింది. దీనినే ప్రధాని జమిలికి అంటగట్టి ప్రస్తుత ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను, జరగబోయే రాష్ట్రాలను కలుపుకుని తొలిదశ జమిలికి సిద్ద చేయబోతున్నారన్న వాదనలూ ఉన్నాయి. ఇందులో నిజమెంతో అబద్దమెంతో చెప్పడం కష్టం, కానీ ఉమ్మడి గా ఎన్నికలు జరిగేలా వ్యవస్తను ముందుకు జరపాలి. పదేపదే ఎన్నికలు ప్రజలపై భారం మోప నున్నాయి. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరగడం అన్నది ఖర్చురీత్యా మంచి అభిప్రాయంగానే చూడాలి.