‘జమిలి’ రాష్ట్రాలపై దాడే..
` దీనిపై ఉన్నతస్థాయి కమిటీ అనేది కేవలం నామమాత్రపు ప్రక్రియే.
` కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయి
` అందుకే మా నేత అందులో ఉండేందుకు నిరాకరించారు.:రాహుల్ గాంధీ
దిల్లీ(జనంసాక్షి):జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది.అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడిరది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.’ఒకే దేశం`ఒకేసారి ఎన్నికలు.. భారత్ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ అంటే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.ఇక ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా 8 మంది ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటయ్యింది. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే, ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలనూ వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.
జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరేదేమిటి?: కేజ్రీవాల్
చండీగఢ్: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికల అంశంపై కేంద్రం జోరుగా పావులు కదుపుతోంది. ఈ విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని సైతం నియమించింది.ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తోన్న ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ కాన్సెప్ట్ హేతుబద్ధతపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జమిలి ఎన్నికలతో సామాన్యులకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేంటని ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘’దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం` ఒకేసారి ఎన్నికలా? లేదంటే ఒకే దేశం` అందరికీ ఒకే రకమైన విద్య, వైద్యమా (ధనిక, పేదలందరికీ సమానంగా నాణ్యమైన చదువు). అసలు జమిలి ఎన్నికలతో సామాన్యుడికి కలిగే మేలు ఏంటి?’’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నలు సంధించారు.ఆదివారం హరియాణాలోని భివానీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి పర్యటించనున్న వేళ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఉచితాలను అందించడం కంటే స్వావలంబన కల్పించేందుకే భాజపా కట్టుబడి ఉందంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. దిల్లీ, పంజాబ్‌లలో ఆప్ సర్కార్ ఉచితంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తోందన్నారు. ‘’ఖట్టర్ సాబ్.. మేం ప్రపంచ స్థాయి ఉచిత విద్య, వైద్యాన్ని దిల్లీలో అమలు చేస్తున్నాం. 24గంటల పాటు ఉచితంగా విద్యుత్, తాగునీరు అందిస్తున్నాం. ఇదే పనిని పంజాబ్‌లోనూ మొదలుపెట్టాం. ఈ సౌకర్యాలు కల్పించడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే హరియాణా ప్రజలు సైతం పొందబోతున్నారు’’ అని పేర్కొన్నారు