జమ్ముకాశ్మీర్ తొలి మహిళా సీఎంగా ముఫ్తీ ప్రమాణం

w2zmr7hy

మహబూబ ముఫ్తీ. జమ్ముకాశ్మీర్‌ తొలి మహిళ సీఎం. దేశంలోనే రెండో ముస్లిం మహిళ సీఎం. జమ్ముకాశ్మీర్‌ లాంటి రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి రావటమే కష్టం. అలాంటిది పొలిటకల్‌ గ్రౌండ్‌ లో సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌ గా ఎదిగారు ఆమె. ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. రాజకీయాల్లో ఎంట్రీ కోసం మాత్రమే తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ వారసత్వం ఆమెకు ఉపయోగపడింది. ఆ తర్వాత మాత్రం సొంత ప్రతిభతోనే ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ మేధావిగా పేరొందిన తండ్రి ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌ను మించిపోయేలా ఆమె పాపులర్‌ అయ్యారు.

పీడీపీ ప్రారంభంలోనే దివంగత ముప్తీ మహ్మద్‌ సయ్యద్‌ హవా నడిచింది. ఎప్పుడైతే మెహబూబ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిందో ముప్తీ మహ్మద్‌ సైతం డమ్మీ అయిపోయారు. తన ప్రతిభతో పార్టీ వ్యవహారాలన్నీ మొహబూబనే చక్కబెట్టేవారు. ఎన్నికల ప్రణాళిక నుంచి ఇతర పార్టీలతో పొత్తుల వరకు ముఫ్తీ మహబూబనే అంతా తానై వ్యవహారించే వారు. తండ్రి మించిన తనయగా పేరుపొందినప్పటికీ ఆమె పార్టీ అధ్యక్షురాలిగా చాలా కాలం బాధ్యతలు చేపట్టలేదు. పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉంటూనే పీడీపీని జమ్ముకాశ్మీర్ తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఎంతో కృషి చేశారు. విపక్ష నేతగా నేషనల్‌ కాన్ఫరెన్స్ సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టారు.

రాజకీయాల్లో అపార అనుభవమున్న మెహబూబ 1959 మే 22 న జమ్ముకాశ్మీర్‌ లోని అక్రనా నౌ పూర్‌ లో జన్మించారు. తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌, తల్లి గుల్షన్ నజీర్. మెహబూబ ముఫ్తీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త జేవ్‌ ఇక్బాల్‌ కు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. మెహబూబా కాశ్మీర్ యూనివర్సిటీ నుంచి B.A, LLB డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. రాజకీయ రంగం ప్రవేశానికి ముందు ఆమె సోషల్‌ వర్కర్‌గా పనిచేశారు.

తండ్రి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మెహబూబా ముప్తీ… ఎన్నో కీలక పదవులను నిర్వహించారు. 1996 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మెహబూబను కాంగ్రెస్‌ పార్టీ విపక్ష నేతగా ఎంపిక చేయటం విశేషం. 2002 నుంచి 2004వరకు మరోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మాత్రం లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు మెహబూబ. 2004 నుంచి 2009 వరకు లోక్‌ సభ సభ్యురాలిగా పనిచేశారు. 2009 లో మాత్రం ఆమె పోటీ చేయలేదు. మళ్లీ 2014 లోక్‌ సభ ఎన్నికల్లో ఆనంత్‌ నాగ్‌ నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
జమ్ముకాశ్మీర్ పీడీపీ…బీజేపీతో పొత్తు విషయంలోనూ మెహబూబ ముఫ్తీయే కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మెహబూబకు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తండ్రి దివంగత ముప్తీ మహ్మద్ సయ్యద్ మృతి చెందటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
తండ్రి మరణం తర్వాత బీజేపీతో పొత్తు కంటిన్యూ చేయటం విషయంలో ముందుగా మెహబూబ ముప్తీ ఆసక్తి చూపలేదు. పలు అంశాలకు సంబంధించి బీజేపీతో విభేదాలు ఉండటంతో రెండు నెలల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి మెహబూబతో చర్చలు జరపటంతో పాటు పీడీపీ డిమాండ్లకు అంగీకరించటంతో సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు.