జమ్ములో మహబూబ్‌నగర్ జవాను మృతి
మహబూబ్‌నగర్,సెప్టెంబర్19(జనంసాక్షి) జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పిట్టల గోపాల్ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన పిట్టల గోపాల్ 12 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఇన్నాళ్లపాటు మంచిగానే ఉన్నా ఉన్నట్టుండి శనివారం ఉదయం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ గోపాల్ మృతి చెందినట్లు అక్కడి నుంచి ఫోన్ లో సమాచారం అందించారు. దీంతో కలవర పడిన కుటుంబీకులు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకున్నారు. జవాన్ గోపాల్ చనిపోయింది వాస్తవమని వారు చెప్పారు. మృతికి గల కారణాలు మాత్రం తెలియటం లేదన్నారు. జవాన్ అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు.