జమ్ము కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇకలేరు
– ప్రముఖులు సంతాపం
– తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ,జనవరి 7(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) కన్నుమూశారు. మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న ముఫ్తీ మహ్మద్ సయీద్ డిసెంబర్ 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గత 10 రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల ఆరోగ్యం పూర్తిగా విషమించి గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పీడీపీ, భాజపా కూటమితో ముఫ్తీ మహ్మద్ సయీద్ 2015 మార్చి 1న జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాశ్మీర్‌లో బిజెఇపితో తొలి భాగస్వామ్య సిఎంగా ఆయన నిలిచారు.
పీడీపీ-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ముఫ్తీ మహ్మద్ గత ఏడాది మార్చి నెలలో జమ్మూ కశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ముఫ్తీ గతంలోనూ కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. 2002లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ముఫ్తీ అప్పట్లో మూడేళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తొలి ఎన్‌డిఎ సర్కార్‌లో ఆయన కేంద్ర ¬ంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ముఫ్తీ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన 1999లో ఆ పార్టీ నుంచి విడిపోయారు. ఆ తర్వాత 1999లో జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ కూడా ఆ పార్టీలో కీలక సభ్యురాలిగా మారారు. ముఫ్తీ మరణంతో ఆయన కూతురు మెహబూబా తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా త్వరలో జమ్మూ కశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని, అందుకు భాగస్వామ్య బిజెపి కూడా ఇటీవల ఓకే చేసింది. తన కూతురు మెహబూబా సీఎం బాధ్యతలు స్వీకరిస్తుందని గత ఏడాది నవంబర్ 13న ముఫ్తీ మహ్మద్ ఓ సందర్భంలో సూచించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలతో మెహబూబాకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆమె సీఎం పోస్టుకు అర్హురాలని ముఫ్తీ అన్నారు. కశ్మీర్ లోయలో పీడీపీ పార్టీ పుంజుకోవడానికి మెహబూబా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిలిటెంట్ల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఆమె తరుచూ పర్యటిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం పీడీపీ పార్టీ ఏర్పడ్డ నాటి నుంచీ మెహబూబా చురుగ్గా పనిచేస్తున్నారు. సిఎం మృతితో జమ్మూ కశ్మీర్‌లో ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి మరణంతో కశ్మీర్ యూనివర్సిటీలోని అన్ని పరీక్షలను వాయిదా వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ కూడా గురువారం నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. ఓ కశ్మీర్ రాజకీయ వేత్త సీఎం ¬దాలో ప్రాణాలు విడవడం ఇది రెండోసారి. 1982లోనూ అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా కూడా సీఎం ¬దాలోనే కన్నుమూశారు. ముఫ్తీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లనున్నారు. సీఎం ముఫ్తీ మృతిపట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముఫ్తీ సాహిబ్ మరణం తీవ్రగ్భ్భ్రాంతికి షాక్‌కు గురిచేసిందని, అతని ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నట్లు ఒమర్ ట్వీట్ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందిన ముఫ్తీ మృతికి కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ముఫ్తీ పార్దీవదేహానికి ప్రధాని మోదీ పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) మరణం జమ్ముకశ్మీర్‌కు అదేవిధంగా భారత జాతికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ముఫ్తీ మృతికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రజల జీవితాలపై ముఫ్తీ నాయకత్వం చాలా ప్రభావం చూపింది. అతని నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా ఏదీ నిలబడదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. జమ్ముకశ్మీర్ అశాంతికి తన నాయకత్వంలో ఉపశమన చర్యలు చేపట్టి ముందుకు తీసుకువెళ్లారు. మనల్నందరినీ వదిలివెళ్లాడు. ముఫ్తీ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళి అర్పించారు. ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతికి రాష్ట్రపతి ప్రణబ్ సంతాపం ప్రకటించారు. సామాన్య ప్రజలకు తన ప్రేమతో దగ్గరైన వ్యక్తి.గా,ప్రత్యేకంగా నిరుపేదలకు ముఫ్తీ మృతి తీరని లోటని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం ప్రకటించారు. ముఫ్తీ దేశ రాజకీయాల్లో అరుదైన రాజకీయవేత్త. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సంతాపం అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ముఫ్తీ అద్భుతమైన నాయకుడు. జమ్ముకశ్మీర్‌ను భారత్‌తో బలోపేతం చేయడానికే జీవితం మొత్తం అంకితం చేశారని బీజేపీ నేత రాం మాధవ్ అన్నారు. ముఫ్తీ మరణ వార్త విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక. కుటుంబ సభ్యులకు నా మనఃపూర్వక సంతాపం అని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ అన్నారు. ముఫ్తీ మరణం విచారకరం. జమ్ముకశ్మీర్ ప్రజలకు, పార్టీ సహచరులకు నా సంతాపం అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మరణం విచారకరం. ముఫ్తీని ఈ మధ్యనే కలిశాను. ఎవరైనా తనను తేలికగానే కలుసుకోవచ్చు. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని కాశ్మీర్‌కు చెందిన ప్రముఖనటుడు అనుపమ్ ఖేర్ అన్నారు.