జమ్మూకాశ్మీర్‌లో స్థానిక ఎన్నికల బహిష్కరణ

హిజ్బుల్‌ తీవ్రవాదలు పోస్టర్లతో పోలీసుల అప్రమత్తం

శ్రీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జమ్మూ-కశ్మీరులో ప్రజాస్వామ్యానికి గండి కొట్టేందుకు ఉగ్రవాదులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల స్తానిక ఎన్నికలను విపక్షాలు బహిష్కరించినా ప్రభుత్వం వాటిని పక్కాగా నిర్వహించింది. ఇప్పుడు మరోమారు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రజలను ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం పోస్టర్లతో హెచ్చరికలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోడా జిల్లాలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ పోస్టర్లు కనిపించాయి. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఈ పోస్టర్ల ద్వారా ప్రజలను ఆ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. స్టిగఢ్‌లోని ధండల్‌, గుర్మల్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ పోస్టర్లు కనిపించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నారు. జమ్మూ-కశ్మీరులో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 17 నుంచి 9 దశల్లో జరుగుతాయి. ఈ ఎన్నికలకు విఘాతం కలిగించే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లను అతికించారని పోలీసులు చెప్పారు. ప్రజలను మాత్రమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులను కూడా ఉగ్రవాదులు ఈ పోస్టర్ల ద్వారా హెచ్చరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో దోడా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అన్షుల్‌ గార్గ్‌ దండల్‌, గుర్మల్‌ ప్రాంతంలో పర్యటించారు. ప్రజలతో సమావేశమయ్యారు. ఉగ్రవాదుల హెచ్చరికలకు భయపడవద్దని కోరారు. ఉగ్రవాదుల కుట్రలను అర్థం చేసుకోవాలని కోరారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు గస్తీని ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.