జమ్మూ క్యాబినెట్‌ విస్తరణ -డిప్యూటీ సీఎంగా కవీందర్‌ ప్రమాణం

– పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం
జమ్మూకాశ్మీర్‌,జ‌నం సాక్షి ) : జమ్మూ కశర్మీ క్యాబినెట్‌ విస్తరణ జరిగింది. జమ్మూ కశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రిగా గాంధీనగర్‌ ఎమ్మెల్యే కవీందర్‌ గుప్తా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం పదవికి నిర్మల్‌ సింగ్‌ నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సోమవారం
మధ్యాహ్నం కవీందర్‌ గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ-పీడీపీ భాగస్వాములుగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ మంత్రివర్గంలో సోమవారం భారీ మార్పులు చేపట్టారు. గుప్తాతో పాటు పీడీపీ, బీజేపీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు రవాణాశాఖ సహాయ మంత్రిగా కొనసాగిన సునీల్‌ కుమార్‌ శర్మకు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించింది. కాగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా ఈనెల 17న మొత్తం 9 మంది మంత్రులతో బీజేపీ రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే.
కేబినెట్‌ విస్తరణకు కఠువా రేప్‌ కేసు కారణం కాదు – రామ్‌మాధవ్‌
జమ్మూకశ్మీర్‌ కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు కఠువా అత్యాచారం కేసుతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాథవ్‌ సోమవారం తెలిపారు. కొత్త ముఖాలకు కేబినెట్‌లో చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే మార్పులు చేశామని చెప్పారు. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అందుకే కొత్త వ్యక్తులకు చోటు కల్పించదలచుకున్నాం అని ఆయన తెలిపారు. కొత్త మంత్రివర్గంలో ఐదుగురు కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేసినట్టు చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌ కేబినెట్‌ పునర్వవస్థీకరణ సాధారణ విషయమేనని పీఎంఓ కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. గత, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు సవాళ్ల ఆధారంగానే సహజంగా కేబినెట్‌ విస్తరణ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య పక్రియలో ఇది సర్వసాధారణ విషయమేనని జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.