జమ్మూ నుండి పవిత్ర అమర్ నాథ్ యాత్ర

జమ్మూ : చుట్టూ మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాలు.. ఆ పర్వతాల నుంచి జాలువారే హిమనదాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం.. మరోవైపు హర హర మహాదేవ.. శంభో శంకర.. అంటూ వినిపించే మంత్ర నాదాలు.. వీటన్నింటినీ గుండెల్లో మూటగట్టుకొని మంచుకొండల్లో సాహసోపేతంగా ముందుకు సాగే ప్రయాణమే అమర్‌నాథ్‌ యాత్ర.. బుధవారం పవిత్ర అమర్ నాథ్ యాత్ర జమ్మూ నుండి ప్రారంభమైంది. అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తొలివిడతలో 1100 మంది భక్తులు యాత్రలో వెళ్లనున్నారు. బాల్తల్ మార్గం ద్వారా అమర్ నాథ్ కు వెళ్తున్నారు. ఈ బృందంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. దీనితో ఈ మార్గంలో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అమర్ నాథ్ క్షేత్రం సముద్ర మట్టానికి 3,888 మీటర్ల అనగా 12,760 అడుగుల ఎత్తులో ఉంది. ఉగ్రవాదుల దాడి, కేదార్ నాథ్ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపద్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.