జయలలితకు సుప్రీం షాక్: ఫిబ్రవరి 2 నుంచి డే టు డే విచారణ

3
న్యూడిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల కేసును విచారణకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు స్వీకరించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆస్తుల కేసును రోజువారీగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీన, ఆ తర్వాత మూడు, నాలుగు తేదీల్లోను జయ ఆస్తుల కేసును విచారిస్తామని సుప్రీం బెంచ్ న్యాయమూర్తులు పినాకి చంద్ర ఘోష్, అమితవ రాయ్ శుక్రవారం నాడు చెప్పారు. ఆ మూడు రోజుల పాటు విచారణ అనంతరం తదుపరి కొనసాగింపు గురించి చెబుతామన్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సీఆర్ కుమారస్వామి 2015 మే 11వ తేది అక్రమాస్తుల కేసును కొట్టి వేస్తూ జయలలితతో పాటు అందరూ నిర్దోషలు అంటూ తీర్పు చెప్పారు. డీఎంకే నాయకుడు అన్బళగన్ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో 4,000 పేజీలతో అర్జీ సమర్పించింది. హైకోర్టు తీర్పును కొట్టి వేసి ప్రత్యేక కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన తీర్పును అమలు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. జయలలిత న్యాయవాదులు సైతం సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చెయ్యాలని కోరారు. కేసు పూర్తి వివరాలు తెలుసుకున్న అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 2 నుంచి కేసు విచారణ చేపట్టనున్నట్లు చెప్పింది.