జయలలిత ఇక లేరు

10_thsri_jaya_2239093fతమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలిస్తారు. అత్యవసరంగా సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడురోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేస్తారు. ఆమె అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయ సన్నిహితురాలైన శశికళను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.