జర్నలిస్టుపై పరువునష్టం కేసు వేసిన.. 

మంత్రి ఎంజే అక్బర్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ పరువునష్టం కేసు దాఖలు చేశారు. జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన కేసు ఫైల్‌ చేశారు. విదేశాంగ సహాయమంత్రి తరపున అడ్వకేట్‌ కరంజవాలా పాటియాలా కోర్టులో డిఫమేషన్‌ కేసును వేశారు. గతంలో ఎంజే అక్బర్‌ తనను లైంగికంగా వేధించినట్లు జర్నలిస్టు ప్రియా ఇటీవల తన ట్విట్టర్‌ ద్వారా ఆరోపించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విూటూ ఉద్యమంలో భాగంగా ఆమె తన చేదు అనుభవాలను బహిర్గతం చేసింది. దీంతో ప్రతిపక్షాలు ఎంజే అక్బర్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశాయి. లైంగిక ఆరోపణలపై అక్బర్‌ వివరణ ఇవ్వాలని, లేదంటే రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి. అయితే విదేశీ టూర్‌ నుంచి తిరిగివచ్చిన అక్బర్‌.. సోమవారం విదేశాంగ మంత్రి సుష్మాను కలిశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీమంత్రి ఎంజే అక్బర్‌ తన విధులకు హాజరైనట్లు తర్వాత తెలిసింది. సోమవారం మధ్యాహ్నాం ఆయన తన లాయర్‌ ద్వారా జర్నలిస్టు ప్రియా రమణిపై పరువునష్టం కేసు నమోదు చేశారు.