జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తు కోసం వారి పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. అందుకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడిరది.దేశంలోని దర్యాప్తు సంస్థలు జర్నలిస్టు లను విచారించేందుకు, వారి నుంచి పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఫౌండేషన్‌ ఫర్‌ విూడియా ప్రొఫెషనల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. విూడియా ప్రొఫెషనల్స్‌ డిజిటల్‌ పరికరాల తనిఖీలు, స్వాధీనం కోసం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉండాలి. విూడియా వ్యక్తులకు వారి సొంత సోర్సులు ఉంటాయి. గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు. దానిలో సమతుల్యం పాటించాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జర్నలిస్టు డిజిటల్‌ పరికరాల స్వాధీనం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ‘‘విూరు కోరుకుంటే మేం మార్గదర్శకాలను రూపొందిస్తాం. కానీ విూరు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.ఈ విషయమై ఇటీవల 15 విూడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘‘దేశంలో చాలా మంది పాత్రికేయులు ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వారిని కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది’’ అని ఆ లేఖలో విూడియా సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. కొద్దిరోజుల క్రితం న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పనిచేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో దిల్లీ పోలీసులు సోదాలు చేసిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.