జర్నలిస్టుల సమస్యల..  పరిష్కార బాధ్యత నాదే


– జర్నలిస్టుల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషిచేస్తున్నాం
– రాష్ట్ర ఏర్పడి ఐదేళ్లవుతున్నా విూడియా ఆంధ్రా భావజాలాన్ని వదలడం లేదు
– తెలంగాణ వార్తలు ఆంధ్రాలో వేయనప్పుడు.. ఆంధ్రా వార్తలు తెలంగాణలో ఎందుకు?
– తెలంగాణ భావజాలాన్ని ప్రతిభింభించే ప్రతికలకు పెద్దపీట వేస్తాం
– చంద్రబాబువి చిత్తశుద్దిలేని శివపూజలు
– తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితోపనిచేస్తుందని, జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపు, హెల్త్‌ కార్డుల కేటాయింపు తదితర అంశాలపై తాను బాధ్యత తీసుకుంటానని, ఆ సమస్యలను పరిష్కరిస్తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు.  ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు అవుతున్నప్పటికీ కొన్ని పత్రిక, విూడియా సంస్థలు ఇంకా ఆ భావజాల అధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయని అన్నారు. కొన్ని పత్రికలు, విూడియా సంస్థలు.. మేం ఏం చేసిన కరెక్ట్‌.. మేం ఏది చెప్తే అదే వేదం.. అంటూ ఇంకా కూడా తెలంగాణపై అధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణిని మానుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అలాంటి అధిపత్య భావనలు పోతే మంచిందని కేటీఆర్‌ సూచించారు. తాము ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని, ఎవరూ కూడా అధిపత్యం చలాయించాలని కోరుకోవడం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ తన అస్థిత్వాన్ని చాటుకునే దిశగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇక్కడ పొద్దున్నే లేవగానే అమరావతి వార్తలు, అమరావతి వార్తలు వేయండి తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలనే సంస్కారం ఉండాలి కదా అని ప్రశ్నించారు. అక్కడ మన వార్తలు ఉండవు,
తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే మన వార్తలు ఉండనే ఉండవన్నారు. తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లు గానీ వార్తలు కనబడవన్నారు. ఆ సందర్భంగా తాను అక్కడున్న వ్యక్తిని అడుగుతూ.. ఏం మేం ఈ దేశంలో లేమా అని అడిగితే.. సార్‌ అది ఆంధ్రా ఎడిషన్‌ అని చెప్పారని కేటీఆర్‌ అన్నారు. మరి ఆంధ్రా ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు, తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకు అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడితే కొందరికి కోపం వస్తదని, కావునా తెలంగాణ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ పత్రికలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు అవుతున్నప్పటికీ తెలంగాణ వాదాన్ని, అస్థిత్వాన్ని తొక్కిపెడుతున్న ధిక్కార ధోరణి పోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మేమే అధిపత్యం చేస్తాం.. మేం చెప్పిందే వినాలి అనే డ్రామాలు ఇక నుంచి నడవవు అని స్పష్టం చేశారు. తెలంగాణ పత్రికలు, మాధ్యమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా గౌరవించిన పార్టీ టీఆర్‌ఎస్‌ది అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో శ్రీకారం చుట్టిందని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి బాధ్యత తనది అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని, న్యాయవాదులు, కళాకారుల సంక్షేమ కోసం కృషి చేస్తున్నామన్నారు. కోర్టు వివాదాలు లేకుండా ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల పంపిణీకి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని తెలిపారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. చంద్రబాబు నాయుడివి ఆపద మొక్కులు అని కేటీఆర్‌ అన్నారు. మన పథకాలను చంద్రబాబు కాపీ కొట్టిండని తెలిపారు. కేసీఆర్‌ ఏంచేస్తే అవి చేస్తే తాను కూడా గెలుస్తానను అని బాబు అనుకుంటున్నాడన్నారు. చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఏం ఒరిగేది లేదన్నారు. ఆంధ్రా ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైన వాళ్లని,  చైతన్యవంతులు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి గుణపాఠం చెబుతారని కేటీఆర్‌ అన్నారు. ఈకార్యక్రమంలో టీజేఎఫ్‌ యూనియన్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.