జర్నలిస్టు రవీంద్రను నిర్భంధించిన కేసులో కరీంనగర్ సీపీపై ఈసీ కొరడా
` బదిలీ వేటు
` సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు
` పలు ఫిర్యాదుల కారణంగా కరీంనగర్ కలెక్టర్‌పైనా చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 27 (జనంసాక్షి):జనంసాక్షి తెలుగు దినపత్రిక కరీంనగర్ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ పాత్రికేయులు పీఎస్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరడా రaళిపించింది. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత పదిరోజుల క్రితం మంత్రి గంగుల ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు.. టూటౌన్ సీఐని పురమాయించిన విషయం విదితమే. ఈ మేరకు పోలీసు సిబ్బంది పీఎస్ రవీంద్ర ఇంటికివెళ్లి ఆయనను జీబులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారు. ప్రజాసంఘాలు, పలు పార్టీలు ఈ చర్యలు తీవ్రంగా ఖండిరచగా.. జనంసాక్షి రాష్ట్ర బృందం కూడా ఈ నెల 18న ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… సదరు పోలీస్ కమిషనర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా పలు కారణాల రీత్యా కరీంనగర్ కలెక్టర్ గోపీని కూడా బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాసినందుకు కలెక్టర్, సీపీపైన వెళ్లిన ఫిర్యాదు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఒకేరోజు ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై వేటుపడటం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.