జర్నలిస్ట్‌ ఖషోగ్గీ అదృశ్యంతో అమెరికా సీరియస్‌

సౌదీపై చర్యలు తప్పవని హెచ్చరిక
ఇస్తాంబుల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో ఆయన మృతిచెంది వుంటే తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో సౌదీ అరేబియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. బ్రిటన్‌, అమెరికాలకు చెందిన వాణిజ్య కార్యదర్శులు పెట్టుబడుల సదస్సు నుండి వైదొలగనున్నట్లు తెలిపారు. త్వరలో సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి యుఎస్‌ ట్రజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌, యుకే అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి లియామ్‌ ఫాక్స్‌ వైదొలగారు. ఇప్పటికే డచ్‌, ఫ్రాన్స్‌ మంత్రులు, పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం నుంచి వైదొలగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సౌదీ అధినేతలతో చర్చలు జరిపాకే ఈ నిర్ణయం వెలువడటం విశేషం. ఇటీవలే అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో కూడా ఇటీవలే సౌదీని సందర్శించి రాజు సల్మాన్‌తో భేటీ అయ్యారు. మరోపక్క గోల్డ్‌మన్‌ సాక్స్‌, పెప్సీ, ఈడీఎఫ్‌లు కూడా ఈ సదస్సు నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్‌ 2వ తేదీన ఇస్తాంబుల్‌ లోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యమయ్యారు. అనంతరం అతని ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. సౌదీ అధికారులే అతన్ని హత్య చేసి ఉంటారని టర్కీ దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.