జలదిగ్బంధంలో భాగ్యనగరం

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం ఎఫెక్ట్ తో ఆదివారం (ఆగస్టు27) గ్రేటర్‌ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మియాపూర్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, వెస్ట్‌ మారేడ్‌పల్లి, కాప్రా, తిరుమలగిరి, అల్వాల్, ఈసీఐఎల్, చర్లపల్లిలో భారీగా వర్షం కురిసింది. సికిం ద్రాబాద్‌ పరిధిలోని ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, పద్మారావునగర్, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, సీతాఫల్‌మండి, మారేడ్‌పల్లి, మోండా మార్కెట్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై నడుము లోతు వరద నీరు పోటెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతా ల్లోని బస్తీల్లో ఇళ్లలోకి చేరిన నీటిని తొల గించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు.

వర్ష బీభత్సంతో అతలాకుతలమైన మదీనా గూడ, దీప్తీశ్రీనగర్‌ ప్రాంతాలు ఇంకా తేరు కోలేదు. మదీనాగూడలోని ఉషోదయ అపా ర్ట్‌మెంట్, పొట్లపల్లి పవిత్ర అపార్ట్‌మెంట్, సాయితేజ ఫ్రైడ్స్, తులసీరాం కాంప్లెక్స్‌తో పాటు మరో 2 అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి  వర్షపు నీరు చేరడంతో నివాసితులు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 38 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వీరికి బయటివారితో సంబంధాలు తెగిపోయాయి. నీటిని ఇంజిన్లతో తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం (ఆగస్టు27)న కురిసిన వర్షంతో కష్టాలు మరింత పెరిగాయి.కుత్బుల్లాపూర్ లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దత్తాత్రేయ నగర్ పూర్తిగా నీటమునిగింది. వర్షానికి రోడ్లు కొట్టుకు పోయాయి.

మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఓవైపు ఉత్తర భారతం నుంచి ఒడిషా వరకు రుతుపవన ద్రోణి, మరోవైపు ఉపరితల ఆవర్తనం రెండూ కలవడంతో రుతుపవనాలు ఊపందుకున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. దీంతో సోమ (ఆగస్టు 28), మంగళవారాల్లో (ఆగస్టు29) రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉపరితల ఆవర్తనం సోమవారం (ఆగస్టు28) అల్పపీడనంగా మారే అవకాశముందని, అదే జరిగితే మరిన్ని రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని చెప్పారు. వచ్చే నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని… ఒక్కోసారి అక్టోబర్‌ 15 వరకూ విస్తరించే అవకాశాలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.