జలపాతంలో చిక్కుకున్న.. 45 మంది సురక్షితం

– లభ్యంకాని 8మంది ఆచూకీ
– గాలింపు చర్యలు ముమ్మరం చేసిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది
భోపాల్‌,ఆగస్టు16(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్‌గఢ్‌ జలపాతం చూడడానికి వెళ్లి వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఎనిమిది మంది బుధవారం గల్లంతు కాగా వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరి మృతదేహాలు దొరకలేదని అధికారులు వెల్లడించారు. బుధవారం మొహానా ప్రాంతంలోని సుల్తాన్‌గఢ్‌ జలపాతం సందర్శనకు వచ్చిన వీరు ఆకస్మికంగా ప్రవాహ వేగం, నీటి మట్టం పెరగడంతో వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని పసిగట్టి పరుగు పరుగున వెళ్లి ఎత్తుగా ఉన్న బండరాళ్లపైకి చేరారు. ఇలా రాళ్లపైకి చేరిన 45 మంది బుధవారం జలదిగ్బంధంలో ఉన్నారు. గజ ఈతగాళ్ల బృందం, పోలీసులు, సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కాస్త దిగువ ప్రాంతంలో రాయిపై ఉన్న ఐదుగురిని హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు. రాత్రి చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా గురువారం ఉదయానికి మిగతా 45మందిని కూడా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తమ వారు కనిపించడం లేదని ఆరుగురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జలపాతం వద్ద స్నానం చేస్తున్న దాదాపు పది మంది వరదలో కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌, ¬ంగార్డులు, విపత్తు సమయంలో సహాయం చేసే సిబ్బంది, పలువురు స్థానికుల సహాయంతో 45 మందిని కాపాడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సహాయం అందించినందుకు కేంద్ర ¬ం మంద్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చౌహాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారత వైమానిక దళానికి, చురుగ్గా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానికులకు స్థానిక ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పారు. బుధవారం స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జలపాతం వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ జలపాతం నీరు పార్వతి నదిలో కలుస్తాయి.