జల్లికట్టుపై సుప్రీం స్టే

1
న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):తమిళనాడు జల్లి కట్టు రాజకీయానికి మళ్లీ బ్రేక్‌ పడింది. రాజకీయ పార్టీల డిమాండ్‌ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ ను సుప్రింకోర్టు నిలిపి వేసింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. గతంలో కూడా సుప్రింకోర్టు దీనిని నిషేధించగా,కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిపై జంతు రక్షణ బోర్డు, బెంగుళూరుకు చెందిన ఒక స్వచ్చంద సంస్థ దీనిపై మళ్ళీ సుప్రింను ఆశ్రయించాయి. మూగ జీవాలను హింసించడం తగదని వారు వాదించారు.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి స్టే ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసు ఇచ్చింది. తమిళనాడులో ప్రతీ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జల్లికట్టును నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఈ జల్లికట్టు నిర్వహణపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జల్లికట్టు నిర్వహణ విషయంలో తమిళనాడు సర్కార్‌ కేంద్రానికి  లేఖ రాసింది. ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతినివ్వాలని సీఎం జయలలిత లేఖలో కోరారు. కాగా, జల్లికట్టుపై కేంద్రం అనుమతులను నిలిపివేయాలని కోరుతూ వన్యప్రాణి సంరక్షణ బోర్డు, పెటా సంస్థలు నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఇవాళ వాదనలు విన్న సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణపై స్టే విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జల్లికట్టు అతిక్రమిస్తుందని పిటిషనర్లు కోర్టుకు వివరించడంలో సఫలీతకృతులయ్యారు. అయితే, మూడు రోజుల క్రితం జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే.