జాతీయ జట్టులోకి రాయుడు బటీ ట్వంటీ జట్టులో చోటు బతివారికి గాయాలతో అవకాశం
ముంబై, డిసెంబర్ 11: హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడుకు బీసిసిఐ సెలక్టర్ల నుండి పిలుపొచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ ట్వంటీలకు రాయుడు ఎంపికయ్యాడు. గాయపడిన మనోజ్‌తివారీ స్థానంలో అతను చోటు దక్కించుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికవడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. 27 ఏళ్ళ రాయుడు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ హైదరాబాదీ 2012 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి 15 ఇన్నింగ్స్‌లలో 132.14 స్టైక్ర్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. అలాగే రోహిత్‌శర్మ తర్వాత ముంబై జట్టులో అత్యధిక పరుగులు సాధించింది రాయుడే.. అలాగే దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తోన్న అంబటి రాయుడు బరోడా తరపున ఆడుతున్నాడు. గత ఐదు మ్యాచ్‌లలో అతను ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా రాయుడు కెరీర్ చూస్తే 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 43.55 సగటుతో 4748 పరుగులు సాధించాడు. వీటిలో 13 సెంచరీలు , 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వికెట్‌కీపర్‌గా కూడా రాణిస్తుండడం అతనికి కలిసొచ్చే అంశం. చాలా కాలంగా రంజీల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటకీ… ఒక్కసారి కూడా జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది టీ ట్వంటీ ప్రాబబుల్స్‌లోకి ఎంపికైనా… 15 మంది జాబితాలో మాత్రం సెలక్ట్ కాలేకపోయాడు. అయితే మనోజ్ తివారీ రంజీ మ్యాచ్‌లో గాయపడి , ఆరు వారాలు ఆటకు దూరం కావడంతో రాయుడుకు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో గురువారం నుండి చివరి టెస్ట్ ప్రారంభం కానుండగా… అది ముగిసిన తర్వాత రెండు టీ ట్వంటీలు ఉన్నాయి. డిసెంబర్ 20 , 22 తేదీలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.