జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రణబ్‌

h3oeh6wnన్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆహూతులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్‌ హోలాండ్‌ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోలాండ్‌ను ఈ వేడుకకు సాదరంగా తోడుకొని వచ్చారు. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

రాజ్‌పథ్‌ ఆవరణలో కళ్లుచెదిరే రీతిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు కొనసాగుతున్నాయి. మొదట త్రివిధ దళాలు కవాత్తు నిర్వహించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వందనం సమర్పించాయి. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబసభ్యులకు, విశేష సేవలందించిన వీర సైనికులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు ప్రదానం చేశారు. మువన్నెల పతాపు రెపరెపల కింద శకటాల కవాత్తు, సైనికుల కళ్లు చెదిరే విన్యాసాలతో కోలాహలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సైనిక బలగాలు తమ పాటవాన్ని, శక్తిసామర్థ్యాలను విశేష రీతిలో ప్రదర్శిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఈసారి విదేశీ సైన్యం కూడా రాజ్‌పథ్‌ వద్ద కవాతు నిర్వహించింది. ఫ్రాన్స్ సైన్యం తన విన్యాసాలతో ఆకట్టుకుంది.