జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ కీర్తి పతాక రెపరెపలు…
— చండీఘర్ లో జరిగిన జాతీయ సెమినార్ లో ప్రధాన ఆకర్షణగా తెలంగాణ ప్రగతి…
–భారతావనికి చాటి చెప్పిన తెలంగాణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
–దేశానికి దిశా నిర్దేశంగా మన పల్లె ప్రగతి… అభివృద్ధి, సంక్షేమ పథకాలు
చండీఘర్ లో మన కీర్తిని చాటి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు….
హన్మకొండ 27 ఆగస్టు జనంసాక్షి
తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి జాతీయ చర్చగా మారింది. ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి పల్లె ప్రగతి జాతీయ పతాకగా మారింది. ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం పంజాబ్ లోని చండీగర్ లో నిర్వహించిన జాతీయ సెమినార్ లో మన రాష్ట్రం నుండి పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ అభివృద్ధిని సెమినార్ లో వివరించారు. దీంతో అక్కడ హాజరైన కేంద్ర మంత్రి, ఆ రాష్ట్ర మంత్రి సహా, మిగతా రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ పల్లెల అభివృద్ధిపై అభినందిస్తూ, ఆసక్తి కనబరిచారు. ఈ విషయాలను దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ లింగన్నగౌడ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావుని కలిసి చెప్పారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి, ఆ సర్పంచ్ ని, పాల్గొన్న ఇతర ప్రతినిధులను అభినందించారు. మన ప్రగతిని మరోసారి దేశానికి చాటి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సాఫల్య ఫలం సిఎం కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంజాబ్ లోని చండీగర్ లో ఈ నెల 22,23 తేదీల్లో గ్రామ పంచాయతీలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ – గ్రామ పంచాయతీలలో స్వీయ నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు@ అనే అంశంపై మీద రెండు రోజుల సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్ కి, దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోనే ఉత్తమంగా ఎంపికైన స్థానిక సంస్థల నుంచి ప్రతినిధులను పంపించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ గోవర్దన్ రెడ్డి, వరంగల్ జిల్లా గీసుకొండ మరియాపురం సర్పంచ్ బాల్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్ మీనాక్షి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ లింగన్నగౌడ్, నిజామాబాద్ జిల్లా మార్తాడ్ సర్పంచ్ ధరణి, హన్మకొండ డిపిఓ జగదీశ్వర్ లు ప్రతినిధులుగా హాజరయ్యారు.
కాగా, వీరంతా రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో అమలు అవుతున్న పల్లె ప్రగతి పథకం, 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, వివిధ పథకాలు, ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నామని సెమినార్ లో మాట్లాడుతూ తెలిపారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీలు,
డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు ఏర్పాటు చేసిన విధానాన్ని వివరించారు. అయితే ఇలాంటి పథకాలేవీ తమ తమ రాష్ట్రాల్లో లేవని వారు తెలిపారని వారు అన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణలో సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లిలు చేసి చూపిస్తున్నారని వివరించారు. దీంతో ఆ సెమినార్ లో పాల్గొన్న వాళ్ళంతా అభినందనలు తెలిపారన్నారు. కేంద్ర మంత్రి సైతం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సెమినార్ కు హాజరైన వాళ్ళకి సూచించారని వారు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తనను కలిసిన, ఆ సెమినార్ కు హాజరై వచ్చిన ప్రజాప్రతినిధులందరినీ అభినందించారు. ఇవ్వాళ తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శంగా మారిందని, ఈ క్రెడిట్ అంతా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లకే దక్కుతుందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దుతూ బంగారు తెలంగాణ చేస్తున్న వాళ్ళకి తన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.