జాబిల్లిని ముద్దాడే క్షణాలు
జంద్రుబి అవతలి వైపు దృశ్యాలు
ఆసక్తిగొలిపేలా చంద్రయాన్`3 ఫోటోలు
బెంగళూరు,ఆగస్ట్21 (జనం సాక్షి) : చందమామను విక్రమ్ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజురోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్`3 మిషన్ సాప్ట్ ల్యాండిరగ్ ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక ఘట్టానికి ఆగస్టు 23 బుధవారం సాయంత్రం 6.05 గంటలకు ఇస్రో ముహూర్తం కూడా నిర్ణయించింది. అయితే ఈ అద్భుత క్షణాలకు రెండు రోజుల ముందు చంద్రయాన్`3 ఆసక్తిగొలిపే కొన్ని ఫొటోలను షేర్ చేసింది. భూమి వైపు నుంచి చంద్రుడి ఉపరితలంపై గుర్తించలేని కొన్ని బిలాలను ఫొటోలు తీసి పంపించింది. ప్రముఖలైన ఈ ప్రాంతాలు చంద్రుడి అవతలి వైపు ఉంటాయి. కాబట్టి ఇవి సాధారణంగా కనిపించవు.
చంద్రుడి దక్షిణ ధృవంపై సాప్ట్ ల్యాండిరగ్‌కు అనువైన, సురక్షిత ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ ఫొటోలను తీసింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇస్రో పంచుకుంది. చంద్రుడి అవతలివైపు సుదూరంలో ల్యాండర్ హజార్డ్ డిటెన్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా బంధించిన చిత్రాలు ఇవి. సేఫ్ ల్యాండిరగ్ కోసం పెద్దపెద్ద బండరాళ్లు లేదా లోతైన కందకాలు లేని ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఈ కెమెరాను ఎస్‌ఏసీ వద్ద ఇస్రో అభివృద్ధి చేసిందని ఇస్రో పేర్కొంది. జాబిల్లిపై చంద్రయాన్`3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాప్ట్ ల్యాండిరగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భూమికి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది.