జార్ఖండ్, బీహార్ లో భూకంపం

5రాంచీ/పాట్నా: జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల ప్రజలు హడలిపోయారు. మంగళవారం ఉదయం రెండు రాష్ట్రాలలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు. జార్ఖండ్ లో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదు అయ్యిందని అధికారులు చెప్పారు. జార్ఖండ్ లోని దేవ్ గడ్, ధన్ బాద్ తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. దేవ్ గడ్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్లోని వస్తువులు కిందపడిపోవడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు బయటకు పరుగులు తీశారు.

ఇదే సందర్బంలో బీహార్ లోని జముయ్, గయ ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అక్కడా పలు ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. నాసిరకంగా ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు అన్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత చర్యగా పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బంధువుల ఇళ్లకు మకాం మార్చుతున్నారు.