జాలర్ల ఇంటికి రాహుల్‌

3

చేపల భోజనం

హైదరాబాద్‌ మే27(జనంసాక్షి):

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఓ సాధారణ జాలరి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనంలో చేపల కూరను రుచి చూశారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ త్రిసూర్‌లోని చావక్కాడ్‌లో జాలర్లు ఉండే గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ జాలరి ఇంటికి వెళ్లి పలువురు నేతలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడి మత్సకారుల సంఘంతో మాట్లాడుతూ ‘ కారం కారంగా ఎంతో రుచికరంగా ఉన్న చేపల కూర కోసం ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తానని’ అన్నారు. రాహుల్‌ గాంధీ అక్కడి జాలర్ల కాలనీలోని మొత్తం 51 ఇళ్లకు వెళ్లారు. కరుణాకరన్‌ అనే జాలరి ఇంట్లో రాహుల్‌ గాంధీతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ, స్థానిక ఎమ్మెల్యే ఇతర నేతలు భోజనం చేశారు.

మోడీ పాలనపై రాహుల్‌ విమర్శలు

కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్‌ త్రిసూర్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. భూ సేకరణ బిల్లు ద్వారా రైతులకు తల్లి లాంటి భూమిని లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నం మాదిరిగానే? కేరళలో మత్స్యకారులకు సముద్రంలో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, పేదలను కష్టాల పాలు చేయటమే మోడీ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుందని రాహుల్‌ విమర్శించారు.