జిఎస్టీతో ధరలు స్వారీ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జీఎస్టీ అమలులోకి వస్తే ద్వంద్వ పన్నుల విధానం ఉండదని చెబుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చకపోగా ధరలు స్వారీ చేస్తున్నాయి. నేరుగా ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఊహించని విధంగా ధరలు రెట్టింపు అయ్యాయి. ఓ వైపు షరా మామయూలుగానే ధరలు పెరగడం ఒక ఎత్తయితే, జెస్టీతో మరింత రంగులు అద్దినట్లుగా ధరలు సామాన్యలకు అందుబాటులో లేకుండా పోయాయి. గతంలో 15శాతం ఉన్న సేవల రేట్లు ఇప్పుడు 18శాతానికి పెరిగాయి. ఈ లోపభూయిష్టమైన జీఎస్టీని అమలుచేయడం వల్ల పరిస్థితులు దిగజారే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి ఆర్థిక మంత్రి జైట్లీ జీఎస్టీ శ్లాబుల రేట్లు ఈమధ్య కొంత తగ్గించారు. నోట్ల రద్దు, జీఎస్టీలాంటి ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ స్థితిలో నిలిపాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ సంస్థాగత సంస్కరణలని, నిర్మాణాత్మక మార్పులని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా మరింత పెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదగడానికి ఇవి తోడ్పడతాయని జైట్లీ అన్నారు. ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌, వరల్డ్‌ బ్యాంక్‌ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన..

నోట్ల రద్దుపై స్పందించారు. రహస్యంగా ఉంచినందుకే నోట్ల రద్దు అంతలా విజయవంతమైందని చెప్పారు. న్యూయార్క్‌/-లోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే రోగులకు అవసరమైన వివిధ మందుల, వైద్య పరికరాల ధరలు 7 నుంచి 12 శాతానికి పెరిగినట్లు సమాచారం. వ్యాపారుల అక్రమాలకు ముక్కుతాడు వేసేందుకు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని జీఎస్టీ బిల్లులో సూచించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నవారికి 12 శాతం జీఎస్టీ, 1.25 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు అదనంగా లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు సేవల రేట్లు కూడా పెరిగాయి. నిజానికి శ్లాబుల రేట్లను తగ్గించాలని జీఎస్టీని ప్రవేశపెట్టకముందే పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. జీఎస్టీ మండలి సమావేశాలను అన్ని రాష్టాల్ర రాజధానిలో నిర్వహిస్తూ సలహాలు తీసుకుంటున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడంలేదు. కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం అయినా అన్నీ సర్దుకు పోతాయని జైట్లీ అన్నారు. నోట్ల రద్దు వల్ల డిజిటల్‌ లావాదేవీలు రెట్టింపయ్యాయని, చాలా మంది పన్ను పరిధిలోకి కొత్తగా వచ్చారని చెప్పారు. షాడో ఎకానవిూని రూపుమాపడానికి ఒకదాని తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాత్కాలికమైన ఇబ్బందులే ఉంటాయని స్పష్టంచేశారు. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను పెంచి అదనపు ఆదాయం కోసం పాకులాడింది తప్ప తగ్గిన ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించ లేదు. ప్రజలకు అర్థంకాని విధంగా పెట్రోల్‌ ధరలను కేంద్రం రోజూ పెంచుతోంది. ఆయిల్‌ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా రోజువారీ సవిూక్ష విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ముడి చమురు ధరలు తగ్గినా తాము లీటర్‌ పెట్రోల్‌కి రూ.75రూపాయలు ఎందుకు చెల్లించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ రోజువారీ సంపాదనలో సగానికి పైగా పెట్రోల్‌కే ఖర్చు చేయవలసి వస్తోందని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయం, సరుకు రవాణా, పారిశ్రామిక రంగాల్లో డీజిల్‌ వాడకం ఎక్కువ కాబట్టి డీజిల్‌ ధర పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల సామాన్య ప్రజల నడ్డి విరిగింది. పెట్రోల్‌, డీజిల్‌ పై పన్నులు పెంచి వసూలు చేస్తున్న డబ్బును ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సమర్థించుకుంటున్నారు. పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై మోపి తగ్గిన ధరల లాభాన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకొంటుంది. వంట గ్యాస్‌పై రాయితీని కూడా క్రమంగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించడం ద్వారా వేలకోట్లు ఆఆ చేస్తోంది. అయినా

డిమానిటైజేషన్‌ వల్ల డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయని అవినీతి అంతమైందని నల్లధనాన్ని వెలికి తీశామని ప్రజల్ని నమ్మించాలని ప్రధాని మోడీ చూస్తున్నారు. అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల నల్లధనం కాస్త తెల్లధనంగా మారింది తప్ప ప్రజలకు ఒరిగిందేవిూ లేదు. దేశం వెలుపల పెద్ద ఎత్తున పోగుబడిన నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చి దేశాభివృద్ధికి ఉపయోగిస్తామని, కొంత మొత్తాన్ని ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించారే తప్ప ఏవిూ చేయలేకపోయారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలై ఉపాధి కల్పన తగ్గిపోతున్నా అదే సర్దుకుంటున్న తీరు ఆర్థిక వ్యవస్థను మేడిపండులా చూపిస్తోంది. ఆహార ఉత్పత్తులు పెంచడం కోసం, ధరలు తగ్గించడం కోసం సాగు సంక్షోభాన్ని నివారించే వైపు అడుగులు పడలేదు.