జిఎస్టీ బాదుడు యధాతథం

జీఎస్టీ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించినప్పుడు ప్రధాని వాటిని సమర్థించుకున్న తీరు చూస్తుంటే ప్రధాని తీరు ఆదాయంపై తప్ప ప్రజల ఆందోళనపై లేదని అర్థంఅ వుతోంది. ఏడాదిగా జిఎస్టీపై అనేక విధాలుగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అనేక వస్తువులపై ఇబ్బడిముబ్బడి పన్నుల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిని ప్రవేశ పెటట్‌ఇ ఏడాదయిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం మరోమారు దేశ ప్రజలను వెక్కిరించేదిగానే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటనీ, దానిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేటప్పుడు ఇబ్బందులు సహజమని ప్రకటించారు. అన్ని పన్నుల్నీ కలిపి ఒక్కటిగా చేసినప్పుడు దానిని సాధ్యమైనంత సరళంగా, సున్నితంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇబ్బందుల్ని గుర్తించడంతో పాటు వాటిని తక్షణం పరిష్కరిస్తూ వచ్చాం. సహకార సమాఖ్య తత్వానికి నిదర్శనంగా… రాష్ట్రాలతో కలిసి అడుగులు వేస్తున్నామని అన్నారు. పాలకు, మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లకు ఒకే విధమైన పన్నులు వేయలేమని చెప్పారు. సరుకులు అన్నింటిపై 18 శాతం చొప్పున ఏకీకృత పన్ను విధిస్తే ఆహారోత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే శ్లాబులను తగ్గించి వేయాలన్న డిమాండ్‌ పట్టించుకోవడం లేదు సరికదా ఇక తన పంథామారదని మరోమారు స్పష్టీకరించారు. జీఎస్టీ వచ్చాక మనం ఏది చూస్తామో దానినే చెల్లిస్తాం. బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి చాలా నిత్యావసరాలు సహా దాదాపు 400 వర్గాల వస్తువులపై పన్నులు తగ్గాయి. 150 రకాల వస్తువులపై పన్ను లేదు. చాలావాటిని 5శాతం శ్లాబులో చేర్చాం. 95 శాతం వస్తువులు 18 శాతం కంటే తక్కువ పన్నులోనే ఉన్నాయి. రిటర్న్స్‌ నుంచి పన్ను వాపసు (రిఫండ్‌) వరకు అంతా ఆన్‌లైన్లో పారదర్శకంగా జరుగుతోందని ప్రధాని వివరించారు. సులభతర వ్యాపార నిర్వహణ మెరుగుపడడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలకు లబ్ధి కలుగుతోందని చెప్పారు. అయితే ప్రధాని వ్యాఖ్యలు చూస్తే ఆదాయంపై ఉన్న శ్రద్ద ఆందోళనలపై లేదని స్పష్టమయ్యింది.

అయితే ఏకీకృత పన్ను విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందని, సరుకుల ధరలు దిగి వస్తాయని, సామాన్యులకు ఊరట దక్కుతుందని కేంద్రం చేస్తున్న ప్రచారం ఉత్తిదే అని తేలిపోతోంది. ఏ రంగంపైనా పన్నులు విధిస్తే అది పరోక్షంగా సామాన్యులపైనే పడుతుందని ప్రధాని గుర్తించడం లేదు. జూలై1నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారంత తగ్గడం కాదు పెరుగుతుందని ఆయా వర్గాలు చేస్తున్న ఆందోళన కళ్లముందుక కనిపిస్తోంది. ఎవరు ఆందోళన చెందినా,ఎవరిపైన భారం పడినా అంతిమంగా దాని భారం మాత్రం ప్రజలపైనే అన్న విషయాన్ని పాలకులు గుర్తించి పన్నులు సవరించాల్సింది పోయి సమర్థించు కుంటున్నారు. పన్నులుంటేనే దేశాభివృద్ది అంటున్న జైట్లీ వ్యాఖ్యలు సామాన్యులను అవమానించేవిగా ఉన్నాయి. పాలకులు తాము చేస్తున్న దుబారాను అరికడితే దేశం ఏనాడో బాగుపడేది. ప్రజలు చెమటోడ్చి కడుతున్న పన్నులను వృధా ఖర్చులతో నేతలు ఎంజాయ్‌ చేస్తున్నారు. డాబు దర్పం కోసం ఇష్టం వచ్చినట్లుగా వెచ్చిస్తున్నారు.నిత్యావసరాలతో సహా అన్ని రకాల వస్తువులను జిఎస్టీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చింది. ఐదు, 15 శాతం శ్లాబుల్లో ఈ వస్తువులను చేర్చింది. ఇది సామాన్య ప్రజలపై భారం మోపే చర్యే! దీనికి ఏడాదిగా సాగుతున్న వ్యవహారం, ధరల పెరుగుదలే కారణంగా చూడాలి. ఇక జిఎస్‌టి అమలుతో పన్నుల విధానంలో పారదర్శకత వస్తుందంటూ భారీ ఎత్తున చేసిన ప్రచారానికీ కేంద్ర సర్కారు గండికొట్టింది. అనేక రకాల వస్తువులు, సేవల పన్ను శ్లాబుల విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతుం

డటమే దీనికి నిదర్శనం. ఆందోళన చేస్తున్న వార్గాలను పిలిచి చర్చించడం లేదు. జిఎస్టీ కర్రుకాల్చి వాత పెట్టేలా ఉంది తప్ప ప్రజలను ఆదుకుంటుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఇప్పటికే నోట్ల రద్దుతో ప్రజలు కోలుకోలేని దెబ్బతిన్నారు. రకరాకాల వేధింపులు మొదలయ్యాయి. బ్యాంకులైతే రకరకాల ఛార్జీలతో నడ్డి విరుస్తున్నాయి. మొత్తంగా చూస్తుంటే నోట్ల రద్దు,జిఎస్టీ రెండు కూడా సామాన్య ప్రజలు తమ మానానా తాము బతకలేని దుస్థితికి తీసుకుని వచ్చాయి. జిఎస్‌టితో సామాన్యప్రజలకు ఏదో ఒరిగి పోతుందంటూ కేంద్ర సర్కారు చేసిన ప్రచారంలోని డొల్లతనం బట్టబయలవుతోంది. పన్నుల వ్యవస్థను సరళీకరించి, సామాన్యులకు నిజంగా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటే వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. కానీ దానికి భిన్నంగా ఎవరికో మేలు చేయాలన్న ఆలోచనతో సాధారణ ప్రజలపై భారం మోపడం వల్ల ఏడాదిగా అనేక సంక్షోభాలు సామాన్యులు అనుభవిస్తున్నారు. సెద్ద మొత్తంలో పన్ను విధించడం వినియోగదారులకు పెనుభారమవుతుందని ఆయా వర్గాలు చేస్తున్న ఆందోళనలు ఇక పట్టించుకోరని తాజాగా ప్రదాని వ్యాఖ్యలతో స్పస్టమయ్యింది. అంతేనా అంటే పాలకు,బెంజికారుకు ఒకటే పన్ను వేయలేమని అంటున్నారు. అలా చేయాలని ప్రజలు కూడా కోరుకోవడం లేదు. జిఎస్‌టి అమలు కారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఒకటి, రెండు రంగాలకే పరిమితం కాలేదు. వీటిని నివృత్తిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విచారకరం.