‘జికా’ వైరస్‌కు వ్యాక్సిన్
హైదరాబాద్,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రమాదకర జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్‌లో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాము జికాకు తొలి వ్యాక్సిన్ కనుగొన్నట్లు.. ఇందుకోసం తొమ్మిది నెలల కిందటే పేటెంట్ తీసుకున్నట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో ఇది తొలి విజయమన్నారు. కేంద్రం తొందరగా అనుమతి ఇస్తే దూసుకుని పోతామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను జికా వైరస్ వణికిస్తున్న విషయం విదితమే. జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తుంది. రెండున్నరేళ్లుగా జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో, ప్రభుత్వ అనుమతితో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి రానుందని ప్రకటించింది. ఇక రెండున్నరేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఫలితాలు కనిపించాయన్నారు. ప్రయోగశాల పరిశోధనల్లోనూ వ్యాక్సిన్‌తో జికా వైరస్‌ను నిరోధించగలిగామని స్పష్టం చేసింది. జికా వ్యాక్ పేరుతో వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. అధికారికంగా దిగుమతి చేసుకున్న జికా వైరస్‌తో భారత్ బయోటెక్ ల్యాబ్‌లో వ్యాక్సిన్ కనుగొన్నారని.. ప్రయోగశాలలో పరీక్షించిన దీనికి తర్వాత స్థాయిలో పరీక్షలు జరపాల్సి ఉందన్నారు. ప్రధానమంత్రి చొరవ తీసుకుంటే.. నాలుగు నెలల్లో 10లక్షల వ్యాక్సిన్‌లను తయారుచేస్తామని కృష్ణ తెలిపారు. అంతేగాక.. బ్రెజిల్ లాంటి దేశాలకు ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయగలమన్నారు. వ్యాక్సిన్‌పై ప్రయోగానికి తాము ప్రభుత్వ సాయం కోరామన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తమకు సాయపడేందుకు ముందుకొచ్చిందని కృష్ణ పేర్కొన్నారు. దీనిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. వైరస్‌ను పరీక్షించాల్సి ఉందన్నారు. ఇది గనుక విజయవంతమైతే.. మేక్ ఇన్ ఇండియాకు నిజమైన ఉదాహరణ అవుతుందన్నారు. భారత్ బయోటెక్ ప్రయోగంపై నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జికా .. ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఈ వైరస్ గజగజలాడిస్తోంది. దోమ ద్వారా వ్యాపిస్తుందని భావించిన ఈ వైరస్ తాజాగా లైంగిక చర్య ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు తేలింది. దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేగాక.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పరిశోధనలు జరపాలని ప్రపంచదేశాలను కోరింది.