జిల్లాను ప్రగతిపథంలో నిలిపాం


ప్రచారంలో మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.4,335 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న  తెలిపారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు.  ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు ప్రజలు మేలు చేశాయని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వవిధ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడితే అభివృద్ది సాగుతుందని అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కరదీపికను పంచుతూ ప్రచారం నిర్వహించారు.  సుపరి పాలన అందించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గూడేలు, తండాలను గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు చేశారని.. త్వరలోనే స్వయం పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆదివాసీ గూడెల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రతి గూడానికి రోడ్డు సదుపాయం కల్పించిందని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి గూడేనికి శుద్ధ నీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్‌ రూ.1000 నుంచి రూ.2016కు పెంచుతామన్నారు. పింఛన్‌ పొందే వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించామని మంత్రి తెలిపారు.