జిల్లాలో అడవుల విస్తీర్ణానికి కృషి
పెద్ద ఎత్తున ఒక్కలు నాటేలా ప్రణాళిక: అటవీ శాఖ
కామారెడ్డి,జూలై9(జనం సాక్షి): కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతం తక్కువని, పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటి పెంచాలన్న లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగానిర్వహించబోతున్నామని కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారులు అన్నారు. అడవులను పెంచడం, మొక్కలను సంరక్షించడం లక్ష్యంగా అటవీశాఖ కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో అడవుల సంరక్షణ.. పెంపుదల అందరి బాధ్యతగా గర్తించాలన్నారు.రెవెన్యూ భూముల్లో.. బోడ గుట్టలపై విత్తన బంతులను చల్లి అడవుల పెంపకానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థలు.. పాఠశాలలు.. కళాశాలలు విత్తన బంతుల తయారీకి ముందుకు రావాలన్నారు. దీనిని ప్రజలందరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. పచ్చదనం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టింది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి అయ్యాయి..మూడో విడతలో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మండలానికి లక్ష విత్తన బంతుల తయారు చేయాలని మొదట భావించినా ,జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి కనీసం 50వేల విత్తన బంతులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అటవీప్రాంతం అంతంత మాత్రంగానే ఉండడంతో హరితహారం.. విత్తన బంతుల కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగ విడతలో జిల్లాలో హరితహారంలో 2కోట్ల మొక్కలు నాటాలని కార్యాచరణను సిద్ధం చేసుకొన్నారు. మొక్కలు నాటడం కన్నా విత్తన బంతులతో లక్ష్యం త్వరగా నెరవేరగలదు. విత్తన బంతి అయితే బోడగుట్టలు.. కొండలు.. రాళ్లు.. రప్పలు.. ఎక్కడైనా విసిరేయవచ్చు.. అది పడిన చోట వర్షం కురిసిందంటే చాలు ఆ బంతిలో ఉన్న విత్తనం తడిచి సహజ సిద్ధంగానే మొలకెత్తుతుంది. అయితే విత్తన బంతుల తయారీకి ప్రభుత్వం ఎలాంటి నిధులు విదల్చక పోవడంతోనే ఎవరూ ముందుకు రావడం లేదు. విత్తన బంతుల తయారీకి అవసరమైన అటవీ జాతులైన చెట్ల విత్తనాలను అందబాటులో ఉంచారు. దీనికోసం అటవీ శాఖ అదికారులు వేసవిలోనే విత్తనాలను అటవుల్లోంచి సేకరించారు. ఇలా అటవీ శాఖ అధికారుల ఆధీనంలో నెమలి నార, నారేపి, జిట్రేగి, కానుగ, సీస్స్, వేప, చింత, సీమ చింత, రేల, వంటి విత్తనాలను పోగు చేశారు. ఈ లక్ష్యం నెరవేరేలా కృషి చేస్తామని తెలిపారు.