జిల్లాలో ఆగని సైబర్ నేరాలు ఇద్దరి ఖాతాలో డబ్బులు మాయం
ఖమ్మం, డిసెంబర్ 12 : సైబర్ నేరాలతో వినియోగదారులు భీతిల్లుతున్నారు. డబ్బులున్నాయన్న భయంతో ఎటిఎం కేంద్రానికి వెళ్తే పిడుగులాంటి నిజం గుండెల్లో గుబులు పుట్టిస్తోందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నాలుగున కొత్తగూడెంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఖాతాలో డబ్బులు మాయమైనట్లు కొత్తగూడెం ఎస్‌బిహెచ్ ప్రధాన బ్రాంచ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మూడవ ఇన్‌క్లైన్‌కు చెందిన సింగరేణి కార్మికులు అబ్దుల్ ఖరీం, కూలిలైన్ ప్రాంతానికి చెందిన రఘుమాచారి ఖాతాలలో 50 వేల రూపాయలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వారి ఖాతాల్లో ఉన్న మొత్తం అక్టోబర్ 21న జైపూర్‌లో ఎటిఎం కార్డు ద్వారా లూటీ అయినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ మేరకు మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం పోస్టాఫీసు బ్రాంచ్‌లో, మాజీ కార్మికుడి ఖాతాలో 3.80 లక్షల నగదు అపహరణకు గురైంది. పోలీస్‌స్టేబుళ్ల నగదు కూడా చోరీకి గురైంది. కాగా ఇంతవరకు గల్లంతైన నగదును అధికారులు ఇప్పించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.