జిల్లాలో కొత్తగా 62 పోలింగ్ కేంద్రాలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా 62 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఓటరు నమోదు, సవరణలకు ఈ నెల 4తో ముగిసింది. జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలు, బోథ్ నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు నియోజకవర్గాల్లో 518 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. మరో 62 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 19, బోథ్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉండడంతో 43 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్తవాటితో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 580కి చేరనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను సైతం ఏర్పాటు చేయనున్నారు.