జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలి
అధికారులందరు సమన్వయంతో పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో వానాకాలం పంట కొనుగోలుకు ఈ నెల 22న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ చాంబర్ నందు ఎస్.మోహన్ రావుతో కలిసి ఖరీఫ్ 2022 ధాన్యం కొనుగోలుపై అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  డిఆర్డీఏ ద్వారా 100, డిసిఓ ద్వారా 85 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాటు చేసే కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తూ  రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అవసరమైతే మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.పంట పండించిన రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే విధంగా, అలాగే తేమశాతం 17 శాతం మించకుండా ఉండాలన్నారు.ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహనతో పాటు ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రూ.2060 , గ్రేడ్ సి కామన్ వెరైటీ రూ.2040   కల్పించాలని సూచించారు. ఏర్పాటు చేసే అన్ని కేంద్రాలలో ధాన్యం శుద్ధి మిషన్లు, తేమశాతం మీటర్లు, ఖంటాలు తప్పక అందుబాటులో ఉంచాలని అన్నారు.ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులకు పూర్తిగా సహకరించాలని సూచించారు.ఇతర జిల్లాల నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్టులలో గట్టి నిఘా ఉంచాలని, అలాగే జిల్లాలో వర్షాలు తరుచుగా పడుచున్నందున కొనుగోలు చేసే ధాన్యం తడవకుండా వాటర్ ప్రూఫ్ టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ పిడి కిరణ్ కుమార్ , డిఏఓ రామారావు నాయక్ , డిఎం రాంపతి నాయక్ , మార్కెటింగ్ అధికారి సంతోష్ , ఆర్టిఓ వెంకట రెడ్డి, ఏఎస్ఓ పుల్లయ్య , జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ , తాలూకా మిల్లర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area