జిల్లాలో చురుకుగా బడిబాట కార్యక్రమం
తొలిరోజు 1235 మంది పిల్లలను బడిలో చేర్పించిన అధికారులు
కామారెడ్డి,జూన్5(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రెండోరోజు అనేక గ్రామాల్లో అధికారులు బడిబాటలో పాల్గొన్నారు.బడిబాటలో మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1235 మంది పిల్లలను బడిలో చేర్పించారు. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి గంగాకిషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాల కార్యక్రమం చేపడుతోంది. బడిబయట పిల్లలను గుర్తించి వారిని ప్రభ్తుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం మొదటి విడత బడిబాట కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు ఉపాధ్యాయులు పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బడిబయట పిల్లల వివరాలను సేకరించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి చెప్పారు. చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని అవగాహన కల్పించారు.