జిల్లాలో పాలన అస్తవ్యస్థం

నిజామాబాద్‌, జూలై 19 : జిల్లాలో ప్రస్తుతం పాలనా వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినట్లు కనిపిస్తుందని, కనీసం మహిళలను మహిళ సంఘాలను సైతం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత, జిల్లా అధ్యక్షురాలు అనసూయ విమర్శించారు. నగరంలోని ఐద్వా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. ఐద్వా డ్వాక్రా గ్రూపులపై అధ్యయనం చేస్తే మహిళ సంఘాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు బయటపడ్డాయని , డ్వాక్రా గ్రూప్‌లను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. డ్వాక్రా పావలా వడ్డీ రుణాలను నిలిపివేయడానికి పాలకులు కుట్రలు పన్నుతున్నారని సక్రమంగా నడుస్తున్న గ్రూపులను బ్యాంకు రుణాలు ఇవ్వకుండా మహిళలను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. ప్రతీ నెలలో పొదుపు బ్యాంకులో ముందుగా వేయాలని అన్ని బ్యాంకుల అధికారులు డ్వాక్రా లీడర్‌లకు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకులను ఏర్పాటు చేయాలని, వడ్డీ లేని రుణాలివ్వాలని, అభయహస్తం పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. నిరంతరం గ్రూపులలో అనేక సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తక్షణమే డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేయాలని, ఆర్‌.పిల ప్రమేయం లేకుండానే రుణాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లావణ్య, పుష్పా, గోదావరి, సుజాత తదితరులు పాల్గొన్నారు