జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలకు తోడు అదనంగా మరో 17 జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. వీటికి తోడుగా 15 రెవెన్యూ డివిజన్లు, 46 కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కొత్త జిల్లాలపై ముసాయిదా విడుదల కావడంతో మొత్తం జిల్లాల సంఖ్య 27, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 60, మండలాల సంఖ్య 505కి చేరింది. 9 జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలతో 9 జీవోలు విడుదలచేసినట్లు అలీ తెలిపారు. ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో కూడా అభ్యంతరాలు తెలుపొచ్చని ఉపముఖ్యమంత్రి తెలిపారు. నేటి నుంచి నెల రోజుల పాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. దీనికంటే ముందు మరోసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి రాజకీయపక్షాల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటామని చెప్పారు. జనాభా, దూరం ప్రాతిపదికగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ముసాయిదా రూపొందించినట్లు తెలిపారు.