జిల్లాల పునర్విభజనలో ఏకపక్ష నిర్ణయాలు
కేసినో వ్యవహారం పక్కదారి పట్టించే యత్నాలు
నేడు విజయవాడలో దీక్షకు దిగుతున్నట్లు బోండా ఉమ ప్రకటన
విజయవాడ,ఫిబ్రవరి8(జనం సాక్షి): జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనోభావాలను జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. దీనిని దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లా ఏర్పాటు చేశారని అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే జిల్లాలకు పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తూర్పు కృష్ణకు ఎన్టీఆర్, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని అడిగినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బుధవారం విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అవరసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని బోండా ఉమ హెచ్చరించారు. ఇదిలావుంటే టీడీపీ నేత వంగవీటి రాధాపై ఆ పార్టీ నేత బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరుపై రాధా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలియదన్నారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయి. డిసెంబరు 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాలు చేశారు. నాని, వంశీలు ఉద్యమం చేయనక్కర్లేదు… వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలు. రాధా ఆవైపు ప్రయత్నం చేస్తున్నారేమో నేను చెప్పలేను. రేపు నేను చేపట్టే దీక్షకు కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలి. విూడియా ద్వారా అందరికీ ఇదే నా ఆహ్వానం. రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలని అంటూ బోండా ఉమా పిలుపునిచ్చారు.
ఇకపోతే ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, రిటైర్‌మెంట్ వయసు పెంచడం, పన్షనర్ల విషయంలో సర్కార్ మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలనే తాము కోరుకుంటున్నామని, ఈ విషయంలో వారికి అండగా ఉంటామని బోండా ఉమ స్పష్టం చేశారు.