-జిల్లా కలెక్టర్ గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఉదయ్ కుమార్.

-జిల్లాపై కలెక్టర్ ఉదయ్ కుమార్ ముద్ర.
-తక్కువ సమయం లో మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్1(జనంసాక్షి):
జిల్లా కలెక్టర్‌గా ఆయనది ఒక ప్రత్యేక శైలి. వయసులో చిన్నవాడైన సహనంలో పెద్దవాడే అనే పేరు ఉంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని తపనతోనే  కార్యాలయంలో అడుగు పెడతారు. అక్కడ నుంచి మొదలు ఓవైపు అధికారులతో సమావేశాలు, మరో వైపు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లు వీటన్నింటికీ హాజరౌతూనే ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న విద్య మరియు వైద్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఏడాదిలో క్షేత్ర స్థాయికి వెళ్లిన రోజులే అధికం అనడంలో సందేహం లేదు.
 ఇలా చెప్పుకుంటూ పోతే కలెక్టర్‌ పోగారి ఉదయ్ కుమార్ శైలి ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. జిల్లాకు  మూడవ కలెక్టర్‌గా  బాధ్యతలు స్వీకరించి సెప్టెంబర్ 1నాటికి సరిగ్గా ఏడాది గడుస్తోంది.ఈ వసంత కాలంలో ఎన్నో విజయాలను సాధిస్తూ జిల్లాను ఆయన ముందుకు నడిపారు.
 వాటిలో మచ్చుకు కొన్ని….
కలెక్టర్‌గా ఆయన జిల్లాకు వచ్చే నాటికి కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతోంది.క్షేత్ర స్థాయిలో సమీక్షల ద్వారా అతి తక్కువ కాలంలో 80 శాతం నుండి 100 శాతానికి వాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సాధించారు. మెడికల్ కళాశాల అనుమతులకు ప్రభుత్వ ఆస్పత్రి పడకల స్థాయి పెంపు, కళాశాల నూతన భవన నిర్మాణానికి తనిఖీలను పెంచి, నిర్ణీత గడువులోపు నిర్మాణాలను పూర్తి చేయించారు.నత్త నడకలో సాగుతున్న నూతన కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని 20శాతం నుంచి 90శాతం నిర్మాణాన్ని పెంచి, నూతన కలెక్టరేట్ అధికారుల క్యాంపు కార్యాలయాల భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకునేలా కలెక్టర్ కృషి చేశారు.వైద్య ఆరోగ్యశాఖ వైద్యులతో ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షతో ఆరోగ్యశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థలోని లోపాలను చాలా వరకు చక్కదిద్దారు.రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు హిమోగ్లోబిన్ పెంచే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుని, సత్ఫలితాలు సాధించారు. వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని దిశా నిర్దేశం చేస్తూ రాష్ట్రస్థాయిలో జిల్లా ఉత్తమ ఫలితాలు పొందేలా కృషి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచనల్లోని అన్ని అంశాలల్లోనూ ముందు వరసన నిలపడంతో రాష్ట్రంలో జిల్లాకు మంచి ప్రాధాన్యత దక్కింది.జిల్లా జర్నల్ ఆసుపత్రిని తరుచూ సందర్శిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేందుకు కృషి చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్, వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకుని ప్రజలకు కలెక్టర్ ఆదర్శంగా నిలుస్తున్నారు.2020-21లో చివరి ముడు నెలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు సమస్యల నుంచి అధికమించి రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది.నాగర్ కర్నూల్ లో రూ. 11.5 కోట్లతో, కల్వకుర్తి లో 4.5 కోట్ల రూపాయలతో పట్టణాల్లో సమీకృతం మార్కెట్ ల  నిర్మాణ పనుల ప్రారంభంతో మరో అడుగు ముందుకు వేశాయి.
 నాగర్ కర్నూల్ జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ వంగూరు మండలంలో 217 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక వాడకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభించాయి.చెంచులకు గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ఆర్ డి టి సంస్థతో సహకారంతో సఫలీకృతులయ్యా రు.  పాఠశాలలు, అంగన్వాడీల్లో పోర్టిఫైడ్‌ రైస్‌పై అవగాహన కల్పించడంతో వినియోగం పెరిగింది. తద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పోషకాహార లోపం పరిష్కారమయ్యే దిశగా జిల్లా అడుగులు వేస్తోంది. ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ధరణి సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ ఉదయ్ కుమార్ ది ప్రత్యేక శ్రద్ధ అనిచెప్పుకోవచ్చు. ధరణి, రెవెన్యూ సమస్యలను మరింత పరిష్కరించే దిశగా  ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎన్నో భూ పెండింగ్ సమస్యలను నేరుగా తాహాసిల్దార్, ఆర్డీవోల సమావేశాలలోనే పరిష్కారమ య్యేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ప్రణాళికా పరంగా ప్రత్యేక తరగతులు  నిర్వహించండంతో పది పరీక్షా ఫలితాల ద్వారా జిల్లాకు మంచి గుర్తింపు లభించింది.
 పదో తరగతి పరీక్షల్లో జిల్లా 93 శాతాన్ని సాధించి రాష్త్ర స్థాయిలో 16 వ స్థానాన్ని సాధించింది.  కెజిబివిల్లో 100 శాతం సాధించాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దళిత బంధు ద్వారా లబ్ధి పొందే యువకులకు వివిధ పారిశ్రామిక రంగాలపై అవగాహన కల్పించారు.నాగర్ కర్నూల్ ట్యాంక్ బండ్ ను ఐదు కోట్ల రూపాయలతో ఆధునికరించి, భారీ త్రివర్ణ పతాకాన్ని స్థానిక శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు.హరితహారం లో భాగంగా జిల్లాలోని రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకంలో సత్ఫలితాలు సాధించారు.
 సమిష్టి విజయాలు:- కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్:
జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయం, తదితర రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాను.అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో జిల్లాను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.
కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు:
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కి జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగస్తులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, జిల్లా అధికారులు వెంకటలక్ష్మి, నర్సింగ్ రావు, సీతారాం, భూపాల్ రెడ్డి, గోవిందరాజులు, రామ్ లాల్, కృష్ణ, ఉష, రమాదేవి, కలెక్టరేట్ ఉద్యోగులు మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగస్తులు,  తదితరులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చేత కేక్ కట్ చేయించారు.