జిల్లా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
కరీంనగర్,నవంబర్29(జనంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై కేంద్రం తాజా ఆదేశాల క్రమంలో కొత్త జిల్లాల వారిగా క్లస్టర్లను ఎంపిక చేస్తూ వ్యవసాయ శాఖ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. ఇందులో భగాంగా 10 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, వీణవంక, సైదాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, రామడుగు, చొప్పదండి, గంగాధర, చిగురు మామిడి మండలాల్లో ఒక్కో క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో 50 మంది రైతులతో 50 ఎకరాలకు గానూ ఒక బృంద నాయకున్ని నియమించారు. ఇప్పటికే వీరికి శిక్షణ ఇవ్వగా కొత్తగా ఏర్పడిన మండలాలు గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, ఇల్లందకుంట మండలాలకు బృంద నాయకులను ఏర్పాటు చేసి శిక్షణ నిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.90లక్షలు విడుదల చేయడంతో పక్రియను వేగవంతం చేశారు.