జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌

– ఆర్థిక అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ,డిసెంబర్‌ 19,(జనంసాక్షి): జీఎస్టీ కిందికి పెట్రోల్‌ ఉత్పత్తులను చేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.  రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. జీఎస్టీ కిందికి పెట్రోల్‌ను తీసుకురావాలంటే రాష్టాల్రు అంగీకరించాలని, రాష్టాల్రు ఈ అంశంపై త్వరలో ఏకాభిప్రాయం సాధిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీఎస్టీ అంశంపై ఎంపీ చిదంబరం అడిగిన ప్రశ్నలకు మంత్రి జైట్లీ సమాధానం ఇచ్చారు. బీజేపీ మొత్తం 19 రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నదని, మరి పెట్రోల్‌ను జీఎస్టీ కిందికి తెచ్చేందుకు కేంద్రానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయని చిదంబరం ప్రశ్నించారు. జీఎస్టీ మండలి ఎప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని ఆయన అడిగారు.