జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
– ఏడీఎంకె వాకౌట్
న్యూదిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా యావత్ సభ మద్దతు తెలిపింది. జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ పెట్టిన సవరణలకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా డీఎంకే సభ్యులు ముందే వాకౌట్ చేశారు.మూడు కీలక సవరణలతో ఈ చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశమంతా ఒకటే పన్ను వర్తించనుంది. అంతకుముందు గత రెండేల్లుగా జిఎస్టీ బిల్లుకు అవాంతరాలు ఎదురవుతూ రాగా తుదకు అన్‌ఇన పార్టీల ఆమోదంతో బుధవారం రాజ్యసభ ప్రవేశం పొందింది. దీంతో దేశంలో పన్నుల సరళీకరణ విధానం రానుంది. ఏకీకృత పన్నుల విధానంతో దేశంలో అభివృద్ది సాధ్యమవుతుందని రాజ్యసభలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. దీనివల్ల ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుందన్నారు. బుధవారం రాజ్యసభలో జిఎస్టీ బిల్లెను జైట్లీ ప్రవేశపెట్టారు. జీఎస్‌టీ సవరణబిల్లుపై చర్చను ప్రారంభించిన జైట్లీ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ బిల్లు జీఎస్‌టీ అని వివరించారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో జీఎస్‌టీ బిల్లు రూపొందించినట్లు చెప్పారు. వస్తు, సేవల పన్ను సవరణల బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జీఎస్‌టీ బిల్లుపై విస్తృత సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. జీఎస్‌టీ బిల్లుపై ఎంపిక కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. జీఎస్‌టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. గడచిన 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షం ఆమోదం లేకుండా జీఎస్‌టీ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఈసారి ప్రధాన ప్రతిపక్షం ఆమోదంతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించామన్నారు. బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును భాజపా వ్యతిరేకించిందని చిదంబరం పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లులో సవరణలకు అంగీకరించినందుకు సంతోషంగా ఉందని చిదంబరం అన్నారు. పన్ను ఎంత ఉంటుందనేదే బిల్లుకు గుండె వంటిదని, 18శాతానికి మించకుండా పన్నులు ఉండాలని అప్పుడే ప్రజామోదం అవుతుందన్నారు. పార్లమెంటు ఆమోదంతోనే పన్నుల రేట్లలో మార్పులు చేయాలని సభకు తెలిపారు. బిల్లులో మరో 3 సవరణలు చేయాల్సి ఉందని చిదంబరం పేర్కొన్నారు. సరళీకృత వ్యవస్థ కోసమే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు అని భాజపా ఎంపీ భూపేందర్‌యాదవ్ అన్నారు. పన్నుల విధానంలో సంక్లిష్టత వల్లే ఎగవేతలు ఎక్కువగా అవుతున్నాయని, పన్నుపై పన్నుల వల్ల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అభివృద్ధిలో తూర్పు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు.
స్టాక్ మార్కెట్లపై జిఎస్టీ ప్రభావం
రాజ్యసభలో జీఎస్టీ బిల్లు చర్చకు రానున్న వ్యవహారం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ బిల్లుపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించడంతో బుధవారం ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా నష్టపోతూ 27,706.52గా ట్రేడ్ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 74.30 పాయింట్లు కోల్పోయి 8548 వద్ద కొనసాగుతోంది. జీఎస్టీ చర్చకు ఆసియన్ మార్కెట్లు నెగిటివ్ ట్రేడ్ తోడవడంతో, ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎఫెక్‌ట్తోనే మార్నింగ్ సెషన్లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయని, మధ్యాహ్న సెషన్ కు వచ్చేసరికి ఆ నష్టాలు మరింత అధికమయ్యాయని తెలిపారు. ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, సిఎ/-లా, హీరో మోటార్ కార్పొరేషన్ లాభాల్లో నడుస్తుండగా.. హెచ్డీఎఫ్సీ, బీహెచ్‌ఈఎల్, టాటామోటార్స్, హెచ్యూఎల్, ఐటీసీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రాఫిట్ బుకింగ్స్ తో ముందు సెషన్‌స్లో 4శాతం మేర ఎగిసిన ఐటీసీ షేర్లు, 2 శాతం మేర నష్టాలను చవిచూస్తున్నాయి. మరోవైపు యూరోపియన్, యూఎస్ షేర్లు పడిపోవడంతో పసిడి మూడు వారాల గరిష్టానికి నమోదవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 0.20పైసలు బలహీనపడి, 66.92గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.62 లాభంతో రూ.31,837 గా నమోదయ్యింది.




