జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం
– బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
– ఏకాభిప్రాయం వెలిబుచ్చిన సభ్యులు
– 10వ రాష్ట్రంగా తెలంగాణ నమోదు
హైదరాబాద్,ఆగస్టు 30(జనంసాక్షి): జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన జిఎస్టీ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపి, ఎఐఎం,అధికార టిడిపి సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించడంతో తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభ మయ్యాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ బిల్లుకు సంబంధించిన అంశాలను వివరించారు. ఒకే పన్ను, ఒకే విధానం కోసం జీఎస్టీ బిల్లును కేంద్రం ప్రవేశం పెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. శాసనమండలిలలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. సభాపతి మధుసూదనాచారి అనుమతి తో ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్‌టీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లును పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా తమ పన్ను ఆదాయన్ని కోల్పోవడానికి ఒప్పుకోదు… తమ ప్రయోజనాలు కాపాడాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని తెలిపారు. పన్నుల నస్టాన్ని కేంద్రమే భరించే విధంగా ఈ చట్టంలోనే పొందు పరిచారని, అందువల్ల మనకు నష్టం జరగదని అన్నారు. 150 దేశాల్లో అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ఒకేదేశం-ఒకే పన్ను విధానం జీఎస్‌టీ ద్వారా అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటికే 9 రాష్ట్రాల అసెంబ్లీలు జీఎస్‌టీ బిల్లును ఆమోదించాయని సీఎం తెలిపారు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపితే జీఎస్‌టీ చట్టం అవుతుందని సభ్యులకు వివరించారు. జీఎస్‌టీ చట్టం ద్వారా దేశ వ్యాప్తంగా సేవారంగం విస్తృతమవుతోందని వెల్లడించారు. వ్యాట్ ద్వారా గతేడాది రాష్ట్రానికి 31,170 కోట్ల ఆదాయం వచ్చిందని, జీఎస్‌టీ ద్వారా సేవా పన్నులో 50శాతం వాటా రాష్ట్రాలకు వస్తుందన్నారు. రాష్ట్రంలో సేవాపన్ను ఆదాయంలో 35శాతం వృద్ధి నమోదైందని సీఎం వెల్లడించారు. జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను రేటు, విధానాలను రూపొందిస్తుందని, జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం తర్వాత పార్లమెంట్‌కు వెళ్లి చట్టంగా ఆమోదం పొందుతుందని తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉంటారన్నారు. పన్నుల ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. దానికి తగ్గట్టుగా కేంద్రం స్పందించిందన్నారు. పన్నుల ఎగవేతను తగ్గించేందుకు జీఎస్టీ బిల్లు అవసరమన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతే, ఆ నష్టపరిహారాన్ని అయిదు ఏళ్ల వరకు కేంద్రమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. హిమాచల్, బీహార్ రాష్టాల్ల్రో బిల్లు ఇప్పటికే పాసైందన్నారు. బిల్లు విషయంలో ఎంత తొందర చేస్తే, అంతే మంచిదని సీఎం అన్నారు. జీఎస్టీ బిల్లు అంశంపై ప్రధాని తనతో స్వయంగా మాట్లాడారన్నారు. సర్వీసు ట్యాక్స్‌లో రాష్ట్రాలకు వాటా లేదన్నారు. సర్వీసు ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 50 శాతం వాటా వస్తుందన్నారు. తెలంగాణ పదవ రాష్ట్రంగా బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. పెట్రోల్, ఎక్సైజ్ ట్యాక్సులకు జీఎస్టీ వర్తించదన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే మన ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ పలుమార్లు దీనిపై చర్చించారని కూడా సిఎం వివరణ ఇచ్చారు. ఒకే దేశం…ఒకే పన్ను విధానం బిల్లును 2011లోనే యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. కాని ఆ సమయంలో జీఎస్‌టీని ఆమోదిస్తే నష్టపోతామని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీనే బిల్లును వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూడాలని ఆయన కోరారు. జీఎస్‌టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు చిన్నారెడ్డి ప్రకటించారు. లిక్కర్, పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచి అమ్మకాలను ఎంత తగ్గిస్తే అంత మంచిదని ఆయన కోరారు. దాదాపు 60శాతం ఆదాయం సేవారంగం ద్వారానే వస్తోందని, జీఎస్‌టీ పన్ను 18శాతం ఉంచాలని అన్ని పార్టీలు కోరాయని గుర్తు చేశారు. జీఎస్‌టీ ఆమోదం వల్ల వచ్చే నష్టం ఐదేళ్లపాటు భర్తీకి కేంద్రం ఆమోదించటం సంతోషం. ఏ ప్రభుత్వమైనా నడవాలంటే పన్నుల వసూలు తప్పనిసరి. ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం తక్కువ వేయాల్సిన అవసరం ఉంది. జీఎస్‌టీ బిల్లు రావటం వల్ల కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి..కొన్ని పెరుగుతాయి. కెనడాలో అతితక్కువగా కేవలం 5శాతం మాత్రమే జీఎస్‌టీ వసూలు చేస్తున్నారని వివరించారు.భారత అర్థిక సంస్కరణల్లో జీఎస్‌టీ మైలురాయిగా నిలుస్తుందని భాజపా శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో జీఎస్‌టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నుల వసూలులో అవినీతిని అరికట్టేందుకు జీఎస్‌టీ ఉపయోగపడుతుందన్నారు. జీఎస్‌టీ బిల్లు వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. జీఎస్‌టీ బిల్లు సభలో ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను అభినందించారు. అన్ని వర్గాల ప్రజలకు జీఎస్‌టీ బిల్లు ప్రయోజనకరంగా ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. జీఎస్‌టీ ద్వారా దాదాపు 17 రకాల పన్నుల భారం పోతుంది. దేశం మొత్తం ఒకే పన్ను విధానం ఎంతో ప్రయోజనకరం. జీఎస్‌టీ బిల్లు దేశ చరిత్రలో ఓమైలురాయిగా నిలుస్తోందన్నారు. జీఎస్‌టీ అంటే గ్రేట్ సెప్ బై ఇండియాగా అభివర్ణించారు. ఆరోగ్యకరమైన పోటీ అభివృద్ధికి బాటలు వేస్తుంది. జీఎస్‌టీ కౌన్సెల్‌లో 29 రాష్ట్రాల ఆర్థికమంత్రుల ప్రాతినిధ్యం వహించనున్నాయని వివరించారు. ఏకీకృత పన్నుల విధానం రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం. జీఎస్‌టీ ద్వారా అక్రమాలకు, కాలుష్యానికి క్లళెం పడనుందని వెల్లడించారు. తెలంగాణ టీడీపీ కూడా జీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలిపింది. జిఎస్‌టీ బిల్లు వల్ల చిన్న తరహా పరిశ్రమలకు మేలు జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సామాన్యులపై పన్నుల భారం పడకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర కోరారు.




