జీఎస్‌టీ రిటర్న్‌లపై జరిమానా రద్దు

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు గానూ జీఎస్‌టీ రిటర్న్‌లను గడువు పూర్తయిన తర్వాత దాఖలు చేసిన వారిపై జరిమానాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల జీఎస్‌టీ రిటర్న్‌లను ఆలస్యంగా చెల్లించినవారిపై విధించిన జరిమానాను రద్దు చేస్తున్నాం అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేడు ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న జరిమానాలను కూడా తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఇంతకు ముందు జులై రిటర్న్‌లపై విధించిన జరిమానాను కూడా ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్‌లకు కూడా జరిమానాలను రద్దు చేయాలని వ్యాపార సంఘాల నుంచి డిమాండ్‌ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం.. జులై నెలకు సంబంధించి 55.87 లక్షల జీఎస్‌టీ రిటర్న్‌లు, ఆగస్టుకు 51.37లక్షలు, సెప్టెంబర్‌ నెలకుగానూ 42లక్షలకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. జులైలో వచ్చిన వాటిలో కేవలం 33.98లక్షలు మాత్రమే గడువులోగా దాఖలయ్యాయి. ఆగస్టు నెలలో కూడా 28.46లక్షల రిటర్న్‌లు మాత్రమే గడువులోగా వచ్చాయి. ఒక నెల జీఎస్‌టీ రిటర్న్‌లను ఆ తర్వాత నెల 20వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాఖలు చేసే వారు కేంద్రం విధించే జీఎస్‌టీపై రోజుకు రూ.100, రాష్ట్రం విధించే జీఎస్‌టీపై రోజుకు రూ.100 చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది.