జీతాలు పెంచకుంటే ధర్నా చేస్తాం

885rdnor

లండన్: క్వీన్ ఎలిజబెత్ తెలుసుగా. ఆమె బ్రిటన్ దేశపు మహారాణి. చక్కగా తలపై కిరీటం, చేతిలో దండం ధరించి నిశ్చింతగా ఉండటమే ఆమె పని. ఎప్పుడోగానీ, ఆమె బయటకు రావడంగానీ, విదేశీ ప్రముఖులను ఆహ్వానించినప్పుడుగానీ ఆమె కాస్తంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తారు. అంత హాయిగా ఉండే రాణి ఎలిజబెత్ ఇప్పుడు ఓ విషయంలో తలపోటును ఎదుర్కోనున్నారు. తమకు జీతాలు పెంచకుంటే సేవలు చేయబోమంటూ ఆమె పరివారమంతా మొండికేస్తున్నారు. ప్రతిసారి ఇచ్చిన హామీలను దాటేస్తున్నారని, ధర్నా దిగుతామని భయపెడుతూ రచ్చకెక్కారు.

ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్లో పనిచేసే దాదాపు 200 మంది ఈ విషయంపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైనదని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. తమకు ఏడాదికి కేవలం 14,400 పౌండ్లు(రూ.13.35లక్షలు) చెల్లిస్తున్నారని, అవి తమ కనీస జీవన అవసరాలకు కూడా సరిపోవడం లేదని, వాటిని పెంచాలని డిమాండ్ చేశారు.

వీరికి ది పబ్లిక్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ (పీసీఎస్) పేరుతో ఒక యూనియన్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ యూనియన్ ద్వారానే తమ భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని అనుకుంటున్నారు. వీరిలో 120 మంది నేరుగా రాణిగారి వ్యవహారంలో విమర్శలు చేయడం గమనార్హం, అదనంగా నిర్వర్తించే విధులకు చెల్లింపులు కూడా చేయడం లేదని వారు వాపోతున్నారు. మార్చి 31 న లేదా ఏప్రిల్ 14న తమ డిమాండ్పై ఓటింగ్ నిర్వహించాలని పీసీఎస్ నిర్ణయించింది.