జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా?

కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కరీంనగర్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర అన్ని వ్యవసాయ మార్కెట్లలో జరుగుతున్న లావాదేవీలపై ఆరా తీయనున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనివిధంగా విజిలెన్స్‌ యంత్రాంగం యార్డుల్లో తనిఖీలకు దిగనుండటంతో ఏజెంట్లు, కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. కవిూషన్‌ ఏజెంట్లు, కొనుగోలుదారులు, పాలకవర్గాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా గత రెండు దశాబ్దాలుగా యథేచ్ఛగా జీరో దందా నడుస్తోంది. అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు కూడా చూసీ చూడనట్లు పోతున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా ఒక్కో మార్కెట్‌కు కోట్లలో గండి పడుతోంది. వ్యవసాయ మార్కెట్లలో కవిూషన్‌ ఏజెంట్ల ఆగడాలపై నిఘా విభాగం దృష్టిసారిస్తోంది. పంట ఉత్పత్తులు అమ్మిన రైతుల నుంచి అధిక మొత్తం రుసుం వసూలు చేయడం, రైతులకు తక్‌పట్టీలకు బదులు తెల్లకాగితంపై రాసివ్వడం, కొనుగోలుదారులు చెల్లించాల్సిన దడువాయి ఛార్జీలు కూడా రైతులతో అక్రమంగా కట్టించడం లాంటి వాటికి ఇక అడ్డుకట్ట పడనుంది. రైతులు ధాన్యం, మక్కలు, పత్తి అమ్మిన తరువాత వారికి తెల్లకాగితంపై రాసివ్వడం, లెక్కల్లో సరుకును తక్కువగా చేసి చూపడం ఏళ్లుగా జరుగుతున్న తతంగమే. ఇకపై దీన్ని నివారించడానికి విజిలెన్స్‌ అధికారులు ప్రధానంగా దృష్టిసారించనున్నారు.యార్డుల్లో ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టడానికి కొందరు కవిూషన్‌ ఏజెంట్లు తెల్ల కాగితాలపై రాసి ఇచ్చే పట్టీలు తీసుకుంటే రైతులే నష్టపోనున్నారు. దీనివల్ల రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రూ.లక్ష ప్రమాదబీమాను కోల్పోవాల్సి వస్తోంది. విపణి యార్డులకు వచ్చి ధాన్యం విక్రయించిన తర్వాత తక్‌పట్టీలు తీసుకుని సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో ఏవైనా ప్రమాదాలు జరిగి రైతులు మృత్యువాత పడితే రూ.లక్ష బీమా సౌకర్యం ఉంది. వీటిని తీసుకొని వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం అందే అవకాశం లేదు./రిళిజువారీగా వ్యవసాయ విపణులకు వస్తున్న సరుకులను నిశితంగా పరిశీలించనున్నారు. కవిూషన్‌ ఏజెంటు, కొనుగోలుదారులు కొనుగోలు చేసిన సరుకు, యార్డుల్లో నమోదు చేసిన వివరాలతో సరిచూసి అక్రమాలను గుర్తించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తక్‌పట్టీలపై దృష్టిసారించారు. భవిష్యత్తులో అన్నింటినీ కూపీ లాగడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రతి రైతుకు తక్‌పట్టీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే ఏటా రూ.2కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది. రైతులు తక్‌పట్టీలు అడిగి మరీ తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది.