జీవనకాల కనిష్ఠానికి రూపాయి

ముంబయి, ఆగస్టు29(జ‌నం సాక్షి) : అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం భారీగా పతనమైంది. విదేశీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో 40 పైసలకుపైగా పడిపోయి జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. క్రితం సెషన్‌లో రూ.70.10 వద్ద ముగిసిన రూపాయి బుధవారం నాటి ట్రేడింగ్‌లో మరింత పతనమై రూ. 70.32 వద్ద కనిష్ఠ స్థాయిలో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ డిమాండ్‌ పెరగడంతో అంతకంతకూ పడిపోయిన రూపాయి ఒక దశలో 42 పైసలు తగ్గి రూ. 70.52 వద్ద జీవనకాల కనిష్ఠస్థాయిలో ట్రేడ్‌ అయ్యింది. ప్రస్తుతం ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 70.50 వద్ద కొనసాగింది. బ్యాంకులు, ఆయిల్‌ రిఫైనర్స్‌ నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు దేశీయమార్కెట్లు కూడా బుధవారం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఒంటి గంట తర్వాత సెన్సెక్స్‌ 48 పాయింట్ల నష్టంతో 38,849 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 11,721 వద్ద ట్రేడ్‌ అయ్యాయి.