జీవో 49 నిలిపివేత
` ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్(జనంసాక్షి): ఆదిలాబాద్ జిల్లాలో కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ కోసం ఇచ్చిన జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను కలుపుతూ మధ్యలో ఉన్న ప్రాంతంలో కుమురంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం జీవో 49 విడుదల చేసింది. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌లలో లక్షా 49 వేల హెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, జీవో 49ను రద్దు చేయాలని ఆదివాసీ ప్రజలతో పాటు మంత్రి సీతక్క, ఆదివాసీ ఎమ్మెల్యేలు కోరారు. మంత్రి సీతక్క, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వివిధ అంశాలు చర్చించి.. జీవో 49 అమలును నిలిపివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవో 49ను నిలిపివేస్తూ ప్రభుత్వం సోమవారం మెమో జారీ చేసింది. మంత్రి సీతక్క, ఆదివాసీ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.